చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లోనే ఏదో తేడా కొట్టిందంటూ పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు మరింత ఊతమిస్తూ.. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. తాజాగా సైరా షెడ్యూల్ మరోసారి పోస్ట్ పోన్ అయింది.
ఈనెల 5,6,7తేదీల్లో సైరా సినిమాకు సంబంధించి చిన్న షెడ్యూల్ ప్లాన్ చేశారు. మొదటి షెడ్యూల్ లో మిగిలిన యాక్షన్ పార్ట్ ను ఈ 3రోజులు కొనసాగించాలనుకున్నారు. కానీ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఆ షూటింగ్ జరగలేదు. సైరా షూటింగ్ మళ్లీ వాయిదాపడింది. ఎప్పట్లానే ఈసారి కూడా షూటింగ్ ను మరో నెల రోజులు వాయిదావేశారు.
షూటింగ్ వాయిదాపడిన ప్రతిసారి మెగా కాంపౌండ్ నుంచి ఏదో ఒక లీక్ రావడం కామన్ అయిపోయింది. ఒకసారి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు రంగస్థలంతో బిజీ అంటారు. మరోసారి బిగ్ బి అమితాబ్ డేట్స్ సెట్ అవ్వడం లేదంటారు. ఇంకోసారి నయనతార అస్సలు దొరకడం లేదంటారు. ఇలా లీకులతోనే కొన్ని నెలలుగా సైరా సినిమా వ్యవహారం నడుస్తోంది.
కానీ అసలు విషయం మాత్రం వేరే ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సైరా సినిమాకు సంబంధించి చేసిన ఫస్ట్ షెడ్యూల్ చిరంజీవికి అస్సలు నచ్చలేదట. అందులో సన్నివేశాలు, సురేందర్ రెడ్డి మేకింగ్ పై చిరంజీవి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. అందుకే మరోసారి ఫస్ట్ షెడ్యూల్ నే కొనసాగించాలని అనుకున్నప్పటికీ అది కూడా కార్యరూపం దాల్చలేదు.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరక్టర్ ను కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఏఆర్ రెహ్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.