బాహుబలి-2 సినిమా సాధిస్తున్న వసూళ్లను అధిగమించడం ఇప్పట్లో మరో సినిమాకు సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. సేమ్ టైం, ఈ సినిమా రికార్డుల్ని అందుకోవాలంటే అది కేవలం 2.0 మూవీతోనే సాధ్యమనే వాళ్లు కూడా ఉన్నారు. నిజమే, బాహుబలి-ది కంక్లూజన్ సినిమా సాధించిన రికార్డుల్ని అందుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రం 2.0 మాత్రమే.
బాహుబలి-2 సినిమా రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యేంత స్టామినా ప్రస్తుతం ఒక్క 2.0 సినిమాకు మాత్రమే ఉంది. కథాపరంగా ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. బాహుబలి-2 రేంజ్ లో ఇది కూడా గ్రాఫిక్ వండర్ మూవీనే. ఎక్కువమందికి రీచ్ అయ్యే సబ్జెక్టే. పైగా రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్, మలేషియా లాంటి దేశాల్లో కూడా 2.0కు మంచి వసూళ్లు వస్తాయి.
బాహుబలి-2 సినిమా సాధిస్తున్న రికార్డుల్ని క్రాస్ చేయడం భవిష్యత్తులో బాలీవుడ్ వల్ల కాకపోవచ్చు. ఎందుకంటే బాహుబలి-2కు నార్త్ లో మంచి వసూళ్లు వస్తున్నాయి. కానీ ఓ హిందీ సినిమాకు సౌత్ లో ఇన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం లేదు. అందుకే సల్మాన్ ఖాన్ నటిస్తున్న ట్యూబ్ లైట్ సినిమాను ఎవరూ బాహుబలి-2కు పోటీగా చూడడం లేదు. సో.. సూపర్ స్టార్ నటిస్తున్న 2.0 మాత్రమే రేసులో ఉంది.
ప్రస్తుతం 2.0 ముందున్న టార్గెట్స్ రెండు. ఒకటి బాహుబలి-2 సృష్టించిన ఫస్ట్ డే వసూళ్లను అందుకోవడం, రెండోది ఆ సినిమా సాధించిన ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను అధిగమించడం. రజనీ సినిమా థియేటర్లలోకి వచ్చేసరికి ఓవరాల్ వసూళ్ల టార్గెట్ కూడా సిద్ధంగా ఉంటుంది.
వచ్చే ఏడాది జనవరి 25న రజనీ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆరోజు గురువారం పడింది. ఇక జనవరి 26న రిపబ్లిక్ డే హాలిడే. ఆ తర్వాత వీకెండ్. సో, బాహుబలి-2లానే 2.0కు కూడా లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది.