తెల్లారింది..పోస్టర్ వేయండి

మరీ వేళాకోళంగా మారుతోంది సినిమా కలెక్షన్ల వివరాలు ప్రకటించడం. తెల్లవారితే చాలు పది కోట్లు లేదా ఇరవై కోట్లు కలిపి ఓ పోస్టర్ వేసేయడం. దాంతో అవతలి ఫ్యాన్స్ నో పార్టీనో మరోటి వదలడం.…

మరీ వేళాకోళంగా మారుతోంది సినిమా కలెక్షన్ల వివరాలు ప్రకటించడం. తెల్లవారితే చాలు పది కోట్లు లేదా ఇరవై కోట్లు కలిపి ఓ పోస్టర్ వేసేయడం. దాంతో అవతలి ఫ్యాన్స్ నో పార్టీనో మరోటి వదలడం. బన్నీ-త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా వ్యవహారం ఇలాగే వుంది. 

సినిమా మార్నింగ్ షో పడగానే సంక్రాంతి విన్నర్ అంటూ పోస్టర్ వేసారు. దాంతో సరిలేరు టీమ్ కు ఫ్యాన్స్ కు ఎక్కడో కాలింది. వాళ్లు బ్లాక్ బస్టర్ గా బాప్ అనో, బాక్సాఫీస్ కా బాప్ అనో పోస్టర్ వదిలారు. అలా స్టార్ట్ అయింది పోస్టర్ల యుద్దం. 

లేటెస్ట్ గా అల వైకుంఠపురములో టీమ్ నుంచి 220 కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్ వచ్చేసింది. నిజానికి తెలుగునాట షేర్ చెప్పుకోవడమే అలవాటు. కానీ ఫిగర్ పెద్దది కనిపించడం కోసం గ్రాస్ వాడేస్తున్నారు. గ్రాస్ నుంచి నెట్ తీయాలి. ఆ తరువాత షేర్ కాలుక్యులేట్ చేయాలి. అప్పుడు సరైన ఫిగర్ కనిపిస్తుంది.

ఇలా వుంటే జస్ట్ రెండు రోజుల క్రితమే 180 కోట్లు గ్రాస్ అంటూ పోస్టర్ వదిలి ఇప్పుడు 220 కోట్లు గ్రాస్ అంటూ అల వైకుంఠపురములో టీమ్ పోస్టర్ వదలడం చూసి అంతా నవ్వుతున్నారు. రెండు రోజుల్లో నలభై కోట్లు వచ్చేసిందా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ వ్యవహారం అంతా గీతా ఆపీస్ నుంచే నడుస్తోందని తెలుస్తోంది. పోస్టర్లు డిజైన్ దగ్గర నుంచి వదలడం వరకు అంతా గీతా లోనే జరుగుతోందని బోగట్టా. సినిమాకు పని చేసిన డిజైనర్ కూడా ఈ పోస్టర్లు డిజైన్ చేయడం లేదని తెలుస్తోంది.

హారిక హాసిని హ్యాండిల్ నుంచి లేదా హారిక హాసిని పీఆర్ టీమ్ నుంచి కాకుండా గీతా నుంచే ఈ పోస్టర్లు రావడం గమనించాల్సిన విషయం. తమ హీరో కావడంతో ఈ హడావుడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. దాంతో ఇక అల వైకుంఠపురములో కలెక్షన్ల కూడా నమ్మలేని పరిస్థితికి చేరుకుంటున్నాయి. రేపో ఎల్లుండో 300 కోట్ల పోస్టర్ వస్తుందని జోక్ లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈరోజు సాయంత్రం సరిలేరు టీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ మీట్ లో ఏదైనా పెద్ద ఫిగర్ అనౌన్స్ చేయచ్చు అన్న ఆలోచన, అనుమానంతో, బన్నీ టీమ్ ముందుగానే ఈ పోస్టర్ వేయించినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.