తెలుగులో ఇప్పుడు అత్యంత కొరత దేనికీ అంటే సంగీత దర్శకులకే. అయితే దేవీ, లేకుంటే థమన్. మళయాళ, కన్నడ, తమిళ మ్యూజిక్ డైరక్టర్లను ట్రయ్ చేస్తున్నా, మన వాళ్ల అభిరుచికి తగినట్లు అందించలేకపోతున్నారు. దాంతో ఆడియో ఫెయిల్యూర్ వస్తోంది. ఇక తప్పక పెద్ద సినిమాలు అన్నీ దేవీశ్రీ ప్రసాద్ వైపే చూడాల్సి వస్తోంది.
కానీ చిన్న, మీడియం సినిమాల పరిస్థితి ఏమిటి? అందుకే ఒక్కోసారి కొత్త కొత్త వాళ్లను పక్క భాషల నుంచి తెచ్చి పరిచయం చేస్తూనే వున్నారు. రాబోతున్న కళ్యాణ్ రామ్ నా నువ్వే సినిమాకు శరత్ అనే మళయాలీ సంగీత దర్శకుడిని తీసుకువచ్చారు. ఆడియో బాగుందని టాక్ వస్తోంది. శరత్ కు మళయాళంలో మంచిపేరు వుంది.
ఇప్పుడు మరో మళయాళీ సంగీత దర్శకుడు కూడా తెలుగులోకి రాబోతున్నాడు. శామ్ సిఎస్ అనే ఈ కొత్త సంగీత తరంగం ఇప్పటికే తమిళంలో డజను సినిమాలు వరకు చేసి వున్నారు. వాటిలో విక్రమ్ వేధ సినిమా అతనికి మంచి పేరు తెచ్చింది. ఈ కొత్త సంగీత దర్శకుడుని తెలుగులో నిఖిల్-సంతోష్-టాగోర్ మధు కాంబినేషన్ లో తయారవుతున్న ముద్ర సినిమాకు శామ్ ను తీసుకోవాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది.
అటు శరత్ కానీ, ఇటు శామ్ కానీ తెలుగులో కూడా క్లిక్ అయితే సంగీత దర్శకుల కొరత కొంత వరకు తీరుతుంది.