అరవింద సమేత వీరరాఘవ సినిమా ట్రయిలర్ వచ్చేసే ఘడియలు దగ్గరకు వచ్చాయి. మరో 24 గంటల్లో ఆ సినిమా ట్రయిలర్ జనం కళ్ల ముందుకు రాబోతోంది. ట్రయిలర్ వస్తే సినిమా మీద అంచనాలు, సినిమా ఎలా వుండబోతోందీ అన్నదాని పై ఓ క్లారిటీ వస్తుంది.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ అన్నది ఏనాటి నుంచో ఎదురుచూస్తున్న విషయం. పవన్, మహేష్, బన్నీ లాంటి హీరోలతో సినిమా చేసాడు కానీ ఎన్టీఆర్ తో అన్నది ఎప్పటి నుంచో బకాయి వుండిపోయింది. గతంలో ఓసారి జస్ట్ అలా స్టార్ట్ కాబోయి మిస్ అయింది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో అరవింద సమేత వీరరాఘవ సినిమా స్టార్ట్ అయింది.
రాయలసీమ, ఫ్యాక్షనిస్టు నేపథ్యం అనేసరికి ఆసక్తి మరింత పెరిగింది. దానికితోడు ఎన్టీఆర్ సిక్స్ ఫ్యాక్ తో ఫస్ట్ లుక్. ఇంక ఇంతకన్నా ఏం కావాలి ఫ్యాన్స్ కు. కానీ ఇదంతా అడియో విడుదలయ్యే వరకే. తీరా అడియో విడుదలయిన తరువాత ఫ్యాన్స్ ఉత్సాహం చాలావరకు నీరుకారిపోయింది. పాటలు, సాహిత్యం, విలువలు, సన్నివేశాల సంగతి అలా వుంచితే, థమన్ కాపీ ట్యూన్ లు, కేవలం రెండే డ్యూయట్లు అనేసరికి అభిమానులకు కాస్త నీరసం వచ్చిన మాటవాస్తవం.
అయితే త్రివిక్రమ్ దెబ్బతిన్న పులిలావున్నారు. అజ్ఞాతవాసి దారుణ పరాజయం తరువాత తనేంటో చూపిస్తా అంటున్నారు అన్నది అభిమానులకు భరోసాగా వుంది. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత మళ్లీ ఏణ్ణర్థం వరకు ఎన్టీఆర్ సినిమా వుండదు. రాజమౌళితో సినిమా అంటే అదే ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ఈ సినిమా హిట్ ఫ్లాప్ లతో ఎన్టీఆర్ కు పెద్దగా టెన్షన్ లేదు. ఈ సినిమా తరువాత ఏడాదిన్నర సంగతి. అది కూడా రాజమౌళి సినిమా. అందువల్ల దాని బజ్ దానికి వుంటుంది.
నిర్మాతలుగా హారిక హాసిని సంస్థకు కాస్త టెన్షన్ వుంటుంది. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా బ్యానర్ పరువు కాస్తతీసింది. డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే అంత బాగోదు. కానీ సంస్థగా సమస్య ఏమీ వుండదు. మరో సినిమా చెస్తారు కావాలంటే.
కానీ అసలు సిసలు టెన్షన్ అంతా దర్శకుడు త్రివిక్రమ్ దే. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలి. లేదూ అంటే ఇక త్రివిక్రమ్ సత్తా అయిపోయిందన్న విమర్శలు మొదలవుతాయి. ఈ సినిమా హిట్ అయితే బన్నీ రెడీ. వెంకీ రెడీ. కానీ ఫలితం తేడావస్తే, త్రివిక్రమ్ కు కష్టమే. పైగా హారిక హాసినికి మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్నారు. కొంతమంది హీరోలతోనే వెళ్లారు. ఫలితం తేడావస్తే, ఇవన్నీ అప్పుడు రియాక్షన్ చూపిస్తాయి.
పైగా అజ్ఞాతవాసి డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఆ తరువాత ఇంతవరకు పబ్లిక్ లోకి రాలేదు. కేవలం షూటింగ్ తప్ప. మరి మళ్లీ ఫలితం తేడా వస్తే, త్రివిక్రమ్ ఇక మళ్లీ డైరక్షన్ చేస్తారా? అన్నది కూడా అనుమానమే.
అందువల్ల అరవింద టెన్షన్ అంతా త్రివిక్రమ్ దే.