90 శాతం సినిమాలు కథలపై నమ్మకంతో సెట్స్ పైకి వస్తాయి. కొన్ని సినిమాలు కాంబినేషన్లపై నమ్మకంతో సెట్స్ పైకి వస్తాయి. కేవలం ఈ రెండు కేటగిరీలు మాత్రమే ఉంటాయని మనం అనుకుంటాం. కానీ మూడో కేటగిరీ ఒకటి ఉంది. ఈ కేటగిరీలో కథకు తొలి ప్రాధాన్యం ఉండదు, కాంబినేషన్ లెక్కలు అస్సలే ఉండవు. కేవలం నీకెంత-నాకెంత అనే ప్రాతిపదికన మొదలవుతుంది. రీసెంట్ గా ఓ సినిమా అలానే సెట్స్ పైకి వెళ్లింది.
కేవలం డబ్బులు పంచుకోవడమే లక్ష్యంగా ఆ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఓ బడా హీరో కాల్షీట్లను సొమ్ము చేసుకునేందుకు, 2 బడా సంస్థలు చేతులుకలిపాయి. ఈ మొత్తం డీల్ సెట్ చేసేందుకు మరో ఇద్దరు కీలక వ్యక్తులు తెరవెనక పావులు కదిపారు. అలా వాళ్లకు కూడా 'నీకింత-నాకింత' బేసిస్ పై భారీగానే ముట్టింది.
ఆ సినిమా కంటెంట్ ఏంటనేది సదరు హీరో అస్సలు పట్టించుకోలేదు. తక్కువ కాల్షీట్లకు ఎక్కువ మొత్తం వస్తుందనే ఒకే ఒక్క లైన్ మీద సినిమాకు ఓకే చెప్పాడు. ఆల్రెడీ చేస్తున్న సినిమాను పక్కనపెట్టి మరీ డేట్స్ ఎడ్జెస్ట్ చేశాడు.
ఇటు మేకర్స్ కూడా అదే మైండ్ సెట్ తో వర్క్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తిచేసి, అందినకాడికి పుచ్చుకొని, వేరే ప్రాజెక్టుపైకి వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇలా యూనిట్ లోని కీలక వ్యక్తులందరిలో కేవలం డబ్బు ఆలోచన తప్ప, కంటెంట్ ఏంటి, ప్రేక్షకుల అంచనాలేంటి, ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ట్రెండ్ ఏంటి, లాంటి అంశాలపై ఎలాంటి పట్టింపు లేదు.
ఇటు అభిమానులు మాత్రం ఆ వచ్చే సినిమా రికార్డులు తిరగరాస్తుందని, తమ హీరో పాన్ ఇండియా హీరో అయిపోతాడని కలలుకంటున్నారు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఆలోచన ఇలా ఉంటే, అటు మేకర్స్ ఆలోచనలు మాత్రం ఇలా డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. అంతేకాదు, పంపకాలు కూడా ఆల్ మోస్ట్ జరిగిపోయాయి.