అనారోగ్యంతో ఉన్నవారికి 500 రూపాయలు ఫోన్ పే చేసినా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సప్ స్టేటస్ పెట్టుకునే కాలం ఇది. అలాంటిది 11 కోట్ల రూపాయలు దానం చేసినా ఎక్కడా తన పేరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు ఓ వ్యక్తి. ఓ పసివాడి ప్రాణం కాపాడాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి, పసిబిడ్డ ప్రాణానికి ఆ స్థాయిలో సాయం ఎందుకు చేశాడు..?
కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నౌకాదళ అధికారి సారంగ్, అతిథి దంపతుల కుమారుడు నిర్వాణ్ పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. నిర్వాణ్ కు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) టైప్-2 అనే వ్యాధి ఉంది. పుట్టుకతోనే ఉన్న ఆ వ్యాధి కారణంగా నిర్వాణ్ కాళ్లు కదపలేని స్థితిలో ఉన్నాడు. కాళ్లలో చలనం లేదు. చూపులతోనే భావాలు పలికిస్తాడు. ప్రస్తుతం అతడి వయసు 16 నెలలు.
ఇప్పటికే ఉన్నదంతా ఆ దంపతులు పిల్లవాడి వైద్యానికి ఖర్చు చేశారు. రెండేళ్లు నిండకముందే కాస్ట్ లీ మందులు వాడితే పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు వైద్యులు. ఇంకా 8 నెలలే సమయం ఉంది, వైద్యానికి 17.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు సోషల్ మీడియాని ఆశ్రయించారు. ఫండ్ రైజింగ్ కోసం ప్రయత్నించారు. తెలిసినవారు వెయ్యి, రెండు వేలు సహాయం చేశారు. సారంగ్ ఆఫీస్ వాళ్లు కూడబలుక్కుని కొంత సాయం చేశారు. కానీ కోట్ల రూపాయల్లో సాయం దొరకడం అసాధ్యం అని భావించిన ఆ దంపతులు ఆశలు వదిలేసుకున్నారు.
అప్పుడే ఓ అజ్ఞాత దాత వారి అకౌంట్ లోకి 11 కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ దంపతులు షాకయ్యారు. డబ్బులొచ్చాయనే సంతోషం ఓవైపు, అసలా అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆరాటం మరోవైపు వారిని కుదురుగా ఉండనీయలేదు. కానీ ఎంత ప్రయత్నించినా అతని వివరాలు తెలియడంలేదు. కనీసం డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసే సమయంలో బ్యాంక్ స్లిప్ పై పేరు కూడా రాయలేదట. అకౌంట్ వివరాలు కూడా అవతలివారికి తెలియకుండా అంత పెద్ద మొత్తం ట్రాన్స్ ఫర్ చేశాడు.
కృతజ్ఞతలు తెలుపుకునే వీలు లేకపోయినా, ఆ దంపతులు మనసులోనే అజ్ఞాత వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకున్నారు. బిడ్డ వైద్యానికి డబ్బు సమకూరింది. ప్రస్తుతం వాళ్లు ఆ ఏర్పాట్లలో ఉన్నారు.
ఎవరా అజ్ఞాత దాత..?
ఆపదలో ఉన్నవారికి పదో ఇరవయ్యో సాయం చేసేవారు చాలామందే ఉంటారు, వెయ్యి, రెండువేలు, లక్ష రూపాయల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చేవారు కూడా ఉంటారు. కానీ 11కోట్ల రూపాయలు ఇచ్చారంటే అతనెవరో తెలుసుకోవాలనే ఆతృత ఆ తల్లిదండ్రులకంటే సోషల్ మీడియాలో చాలామందికి ఎక్కువగా కలిగింది. కానీ ఫలితం లేదు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలియడంలేదు.
కుడిచేత్తో సాయం చేస్తే ఎడమచేతికి తెలియకూడదనేది పెద్దల నానుడి. దాన్ని అతను స్ట్రిక్ట్ గా ఫాలో అయినట్టున్నాడు. ఈ సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న పని చేసినా సెల్ఫీతో సహా ప్రచారం చేసుకుంటారు చాలామంది. కానీ 11కోట్లు ఇచ్చి సైలెంట్ గా ఉన్నాడంటే అతడు దేవుడంటూ కీర్తిస్తోంది సోషల్ మీడియా. తన బిడ్డ ప్రాణం కాపాడిన అతడికి జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు సారంగ్ దంపతులు.