లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇవాళ్టితో 25 రోజులు పూర్తి చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకుని, తిరుపతిలో అడుగు పెట్టారు. తిరుపతి నియోజకవర్గంలో లోకేశ్ అడుగు పెట్టగానే టీడీపీ ఇన్‌చార్జ్ సుగుణమ్మ, ఆ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. లోకేశ్ పాదయాత్ర గమనిస్తే… కొన్ని స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయి.
ఉదాహరణకు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన తిరుపతి జిల్లా రేణిగుంటకు చేరుకున్నారు. రేణిగుంట బస్టాండ్‌లో అభివాదం చేశారు. అలాగే బస్టాండ్‌లో ఉన్న కొంత మంది మహిళలు, వృద్ధుల వద్దకొచ్చి ఆయన చేయి కలిపారు. కనీసం వారితో మాట్లాడాలన్న ఆలోచన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాదయాత్ర లక్ష్యం, ఉద్దేశం ఏంటో కూడా తెలియకుండానే ఆయన నడక సాగిస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది.
అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో జనం వద్దకెళ్లి పలకరిస్తే, వారి సమస్యలు తెలుస్తాయి. ఆ పని లోకేశ్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఎంత సేపూ ముందస్తుగా కొందరితో సమావేశం కావడం, అక్కడికి వచ్చిన వారు మాట్లాడ్డం, లోకేశ్ తనకు తోచిన సమాధానాలు ఇవ్వడంతో సరిపెడుతున్నారు. అంతకు మించి పాదయాత్రలో జనంతో లోకేశ్ మమేకం కాలేకపోవడం యువగళంలో లోపంగా చెప్పొచ్చు.
చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆయన జనం దగ్గరికెళ్లి పలకరిస్తున్నారు. కాదనకుండా దారిలో సెల్ఫీలు మాత్రం ఇస్తున్నారు. పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలను నేరుగా కలిసి, వారి కష్టనష్టాలు, సుఖదుఃఖాల గురించి ఆరా తీస్తేనే లోకేశ్‌కు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుంది. అప్పుడే నడకకు సార్థకత లభిస్తుంది. లేదంటే కాళ్ల నొప్పులు, సమయం వృథా. కావున పాదయాత్రలో లోపాలను గుర్తించి ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.