కొన్ని నెలల కిందటి సంగతి. చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా రిలీజైంది. అందులో ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవిని యంగ్ గా చూపించడం కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. టెక్నాలజీ బాగానే పనిచేసింది. చిరంజీవి వింటేజ్ లుక్ లోకి మారిపోయారు. కానీ సినిమా ఫెయిలైంది. దాంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వాడి తయారుచేసిన చిరు లుక్ పై కూడా విమర్శలు చెలరేగాయి.
ఇప్పుడు ఇదే టెక్నాలజీని నాగార్జున కోసం వాడాలని చూస్తున్నారు. త్వరలోనే బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగ్. ఈ సినిమాలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఈ ఎపిసోడ్ కోసం ఆచార్య సినిమాలో వాడిన గ్రాఫిక్స్ ను వాడాలనుకుంటున్నారు.
90ల్లో కిల్లర్, నిర్ణయం, వారసుడు, హలో బ్రదర్ లాంటి బ్లాక్ బస్టర్స్ చేశారు నాగ్. ఆ సినిమాల్లో లుక్ కు దగ్గరగా కొత్త సినిమాలో వింటేజ్ లుక్ ను సెట్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు కొన్ని రఫ్ స్కెచ్ లు కూడా రెడీ చేశారు. అంతా ఓకే అనుకుంటే, వయసు తగ్గించే విజువల్ ఎఫెక్ట్స్ వాడేస్తారు.
అయితే చిరంజీవికి సూట్ అవ్వని ఈ గ్రాఫిక్స్ నాగార్జునకు నప్పుతాయా అనేది ఇప్పుడు హాట్ డిస్కషన్. దీనిపై ఎక్కువమంది అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే, నాగ్ ఇప్పటికీ మంచి ఫిజిక్, లుక్ మెయింటైన్ చేస్తుంటారు. కాబట్టి అతడ్ని వింటేజ్ లుక్ లో చూపిస్తే పెద్దగా వ్యతిరేకత, విమర్శలు రావనేది యూనిట్ ఫీలింగ్.
పైగా ఆచార్య టైపులో ఆ లుక్ ను రిలీజ్ వరకు సస్పెన్స్ లో పెట్టకుండా, కాస్త ముందే విడుదల చేసి ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేయాలనే ప్లాన్ కూడా ఉంది. కాబట్టి చిరుకు కలిసిరాని టెక్నాలజీని నాగార్జున బాగానే వాడతాడేమో అనిపిస్తోంది.