టాలీవుడ్ ఛలో ఇటలీ

విదేశాల్లో షూటింగ్ లేకుండా పెద్ద సినిమాలు పూర్తి కావడం కొంచెం కష్టమే. కనీసం ఓ పాట అయినా షూట్ చేసుకురావాల్సిందే. కరోనా టైమ్ కాబట్టి కాస్త అడ్జస్ట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు పోస్ట్ కరోనా…

విదేశాల్లో షూటింగ్ లేకుండా పెద్ద సినిమాలు పూర్తి కావడం కొంచెం కష్టమే. కనీసం ఓ పాట అయినా షూట్ చేసుకురావాల్సిందే. కరోనా టైమ్ కాబట్టి కాస్త అడ్జస్ట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు పోస్ట్ కరోనా టైమ్ లో కొన్ని విదేశాలు షూటింగ్ కు అనువుగా వున్నాయి. వాటిల్లో కీలకమైనది ఇటలీ. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చేవారికి ఇక్కడ క్వారంటైన్ నిబంధనలు కాస్త సరళంగా వుంటున్నాయి. అలాగే కేసుల సంఖ్య కూడా. 

అందుకే టాలీవుడ్ జనాలు ఇప్పుడు ఇటలీ దారి పడుతున్నాయి. ప్రభాస్ 'రాథేశ్వామ్' సినిమా ఎలాగూ ఇటలీ బ్యాక్ డ్రాప్ నే. అందుకే అటే వెళ్తున్నారు. నితిన్ రంగ్ దే సినిమాకు అమెరికా బ్యాక్ డ్రాప్ షూట్ కొంత వుంది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అమెరికా వెళ్లడం, వీసాలు అంత వీజీ కాదు. అందుకే ఇటలీలో లొకేషన్లే అమెరికా లొకేషన్లుగా చూపించడం లేదా కథలో అమెరికా బదులు ఇటలీ అని వాడడానికి యూనిట్ డిసైడ్ అయిపోయింది. దీంతో నితిన్, కీర్తి సురేష్ కూడా త్వరలో ఛలో ఇటలీ అంటున్నారు.

నితిన్ త్వరలో చేయబోయే అంథాదూన్ రీమేక్ కూడా లైన్ లో వుంది. ఈ సినిమాకు మూడు నాలుగు రోజుల ఫారిన్ షూట్ వుంది. అందుకే దాన్ని కూడా ఇప్పుడే పనిలో పనిగా రంగ్ దే కంటిన్యూయేషన్ కానిచ్చేయాలని డిసైడ్ అయ్యారు. అందువల్ల ఆ సినిమా షూట్ కూడా ఇటలీలోనే.

మహేష్ బాబు సర్కారువారిపాట కు మాత్రం ఈ అవకాశం లేదు. ఆ సినిమాకు అమెరికా బ్యాక్ డ్రాప్ చాలా వుంది. అందుకే ఆ సినిమా షూట్ నవంబర్ నుంచి అమెరికాలో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలు అన్నీ షూట్ చేసకుని వచ్చిన దాన్ని బట్టి, వాటి అనుభవాల్ని బట్టి తమ సినిమాల షూటింగ్ లు ప్లాన్ చేసుకోవాలని చాలా సినిమాలు వెయిటింగ్ లో వున్నాయి.