గ్రామ స్వరాజ్యం.. గాంధీజీ కలలుకన్న స్వప్నం. దీన్ని సాకారం చేసి చూపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గ్రామాలకు అత్యథిక ప్రాధాన్యం ఇస్తూ.. అభివృద్ధి-సంక్షేమంలో గ్రామాల్ని భాగస్వామ్యం చేస్తూ జగన్ తీసుకొచ్చిన విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ ఇవాళ్టితో ఏడాది పూర్తిచేసుకుంది.
సరిగ్గా ఏడాది కిందట, గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైనప్పుడు ఎన్నో అనుమానాలు, మరెన్నో విమర్శలు. కానీ జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మనసా-వాచా-కర్మన ఈ కార్యక్రమాన్ని నమ్మారు. భవిష్యత్తులో ఇది అద్భుతాలు సృష్టిస్తుందని నమ్మారు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి జగన్ కల నిజమైంది. సంక్షేమం-అభివృద్ధితో గ్రామాలు కళకళలాడుతున్నాయి. లబ్దిదారులందరికీ ఇంటి ముందుకే ఎన్నో సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.అంతేకాదు.. వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి.
ఒకప్పుడు పెన్షన్ కావాలంటే పడిగాపులు పడాల్సి వచ్చేది. వయసుమళ్లిన వాళ్లను మంచంపై పడుకోబెట్టి ట్రెజరీ ఆఫీసులకు, బ్యాంకులకు తీసుకెళ్లిన సందర్భాలు కోకొల్లలు. అలాంటిది ఇప్పుడు ఒకటో తేదీ ఉదయం 7 గంటలకే పింఛను సొమ్ము ఇంటికొస్తోంది. దీనికి కారణం జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ.
ఒకప్పుడు రేషన్ సరుకులు కావాలంటే చాంతాడంత క్యూ. కానీ ఇప్పుడు సరుకులు ఇంటికే వస్తున్నాయి. ఏళ్లకు ఏళ్లు పట్టే కొత్త రేషన్ కార్డు.. 10 రోజుల్లోనే మంజురు అవుతోందంటే కారణం, జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ప్రభుత్వ సేవల్ని గ్రామాల్లో ఇంటి ముంగిట వాల్చారు జగన్. ఇలా దాదాపు అన్ని రకాల సేవల్ని గ్రామస్థాయికి తీసుకొచ్చారు జగన్. అంతేకాదు.. కీలకమైన ఆధార్ సేవల్ని, భూ రికార్డుల సవరణల్ని కూడా సెక్రటేరియట్ పరిథిలోకి తీసుకొస్తున్నారు. ప్రతి పనికి డెట్ లైన్ విధిస్తున్నారు. తద్వారా జవాబుదారీ కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవల్ని విలేజ్ సెక్రటేరియట్లకు బదిలీ చేయబోతున్నారు.
ఇవన్నీ ఒకెత్తయితే.. కరోనా కష్టకాలంలో వాలంటీర్ల వ్యవస్థ పనితీరు మరో ఎత్తు. విదేశాల నుంచి వచ్చినవారి వివరాలన్నీ పక్కాగా సేకరించడంతో పాటు, వారిని పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయడంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సఫలమయ్యారు.
ఎక్కడి నుంచో వచ్చిన అధికారులు జాగ్రత్తలు చెబితే.. పెద్దగా పట్టించుకోరు. కానీ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు అదే ఊరిలో ఉండేవారు కాబట్టి ఇక్కడ ఫలితం కనిపించింది. పైగా ప్రతి రోజూ పరామర్శ అనే కాన్సెప్ట్ కరోనా బాధితులకు గుండె ధైర్యాన్నిచ్చింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఇది ఎంతగానో ఉపయోగపడింది.
ఇలా ఏడాదిలోనే గ్రామ సచివాలయ వ్యవస్థతో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎంతో మంది లబ్ది పొందారు. కేంద్రం నుంచే కాకుండా, ఏకంగా ఐక్యరాజ్య సమితి స్థాయిలో సైతం ప్రశంసలు అందుకున్న ఈ వ్యవస్థ.. ఇవాళ్టితో ఏడాది పూర్తిచేసుకోవడం అందరికీ ఎంతో గర్వకారణం. ఇలా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏడాదిలో ఎన్నో సత్ఫలితాలనిస్తోంది. మరెన్నో అద్భుతాలు సృష్టించడానికి రెడీగా ఉంది.