ఓటీటీ సంస్థ సిబ్బందిపై ఫిర్యాదు?

టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద సమస్య డిజిటల్ హక్కుల అమ్మకాలే. ఎలా అమ్మాలి.. ఎవర్ని పట్టుకోవాలి.. ఎవరితో డీల్ చేయాలి? నిజానికి బడా ఓటీటీ సంస్థలు అన్నీ కార్పొరేట్ సంస్ధలు. మల్టీ నేషనల్ సంస్థలు.…

టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద సమస్య డిజిటల్ హక్కుల అమ్మకాలే. ఎలా అమ్మాలి.. ఎవర్ని పట్టుకోవాలి.. ఎవరితో డీల్ చేయాలి? నిజానికి బడా ఓటీటీ సంస్థలు అన్నీ కార్పొరేట్ సంస్ధలు. మల్టీ నేషనల్ సంస్థలు. కానీ అక్కడ కూడా కొందరికి నడుస్తోంది. కొందరి హవా సాగుతోంది. కొందరికి సాగడం లేదు. పోనీ కాంబినేషన్లు అలాంటి వాటి వల్ల అనుకుంటే అక్కడ కూడా తేడా వస్తోంది. కొన్ని సంస్థలు తమ ప్రతి సినిమాను అనౌన్స్ చేసినపుడే అమ్మేయగలుగుతున్నాయి. కొన్ని సంస్థలు మంచి కాంబినేషన్ తో సినిమా దాదాపు పూర్తి చేసినా పని జరగడం లేదు.

గతంలో ఇలాంటి పరిస్థితి శాటిలైట్ అమ్మకాల్లో వుండేది. అక్కడ మీడియేటర్లు వుండి, కమిషన్ తీసుకుని అమ్మకాలు జరిపించేవారు. అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాతలు సైతం ఈ మీడియేటర్లనే పట్టుకున్న రోజులు వున్నాయి. ఎందుకంటే నేరుగా వెళ్తే పని జరగదు కనుక. ఓ శాటిలైట్ చానెల్ ఉద్యోగులు ఇలా అడ్డదారిలో ఇష్టం వచ్చినట్లు సినిమాలు కొనేసి, సంస్థకే నష్టాలు తేవడంతో, ఆ సంస్థ ఇక సినిమాలు కొనడమే తగ్గించేసింది.

ఎలాంటి మల్టీ నేషనల్ సంస్థ అయినా మన టాలీవుడ్ జనాలు లొంగదీసేస్తారు. గతంలో ఓ కార్పొరేట్ సంస్థ మన దగ్గర ఆర్థిక సహాయాలు అందించింది. అప్పుడు ఇలాగే అడ్డగోలు వ్యవహారాలు నడిపేసి, ఆ సంస్థ మరి ఇక్కడ ప్రాజెక్టులు టేకప్ చేయకుండా పంపేసారు. అలాగే ఓ టీవీ ప్లస్ ఓటిటి సంస్థ ప్రతినిధిని కూడా మన నిర్మాతలు కొందరు బుట్టలో వేసేసారని, అక్కడ కూడా ఇలాగే ప్రాజెక్ట్ లు సెట్ చేయడం, కమిషన్లు పంచుకోవడం వంటివి జరిగాయని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు ఇదే జాఢ్యం ఓ మల్టీనేషనల్ ఓటిటి సంస్థకు పట్టుకున్నట్లు కనిపిస్తోంది. కొన్ని సంస్థల సినిమాలు ఇంకా క్లాప్ కొట్టకుండానే ఆ సంస్థ కొనేస్తోంది. కొన్ని సంస్థల వైపు చూడడం లేదు. ఓ సీనియర్ హీరో సినిమా 80శాతం పూర్తయినా ఇంకా డిజిటల్ అమ్మకం కాలేదు. మంచి బ్యానర్, మంచి దర్శకుడు. కాంబినేషన్. కానీ అమ్మకం కాలేదు. అదే సీనియర్ హీరో, చిన్న దర్శకుడు. ఇంకా క్లాప్ కొట్టలేదు. అప్పుడే అమ్మకం జరిగిపోయింది.

ఎక్కడ వుంది తేడా? ఇదే బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు సినిమా జనాలు. ఆ రూట్ ఏమిటి? ఎంత ఖర్చవుతుంది. మల్టీ నేషనల్ సంస్థల ఉద్యోగులు కూడా ఇలా చేస్తారా? అన్న డిస్కషన్లు మొదలయ్యాయి. ఈ మేరకు ఆ మల్టీ నేషనల్ ఓటిటి సంస్ధ‌ వరల్డ్ వైడ్ పెద్దలకు ఈ విషయాలు మెయిల్ ద్వారా నివేదించినట్లు తెలుస్తోంది.

కంటెంట్, కాంబినేషన్ పట్టించుకోకుండా, చిన్న, పెద్ద సినిమా అని చూడకుండా కొన్ని సంస్థల సినిమాలు కొనేస్తున్నారు. అన్నీ వున్నా కొన్ని సంస్థల సినిమాలను పట్టించుకోవడం లేదని, దీని మీద లోతుగా విచారణ చేయాలని సదరు ఓటిటి సంస్థ వరల్డ్ వైడ్ అధికారులకు మెయిల్స్ వెళ్లాయని టాక్ వినిపిస్తోంది.

ఇది ఎంత వరకు నిజం అన్నది త్వరలో ఆ ఓటిటి సంస్థ పద్దతుల్లో మార్పు వస్తే తెలుస్తుంది లేదంటే లేదు.