టాలీవుడ్‌లో ‘ఆంధ్రా’ బ్రాండ్‌ ఏదీ.!

కళాకారులకి ప్రాంతాల్లేవు… బాలీవుడ్‌ నుంచి నటుల్ని ఎరువు తెచ్చుకుంటున్నా.. వారిలో టాలెంట్‌ని చూడాలి తప్ప.. వారిని పరాయివారిలా చూడరాదన్న విశాల హృదయం తెలుగు ప్రేక్షకులకి వుంది. తమిళ సినీ పరిశ్రమలో అలా కాదు. అక్కడా…

కళాకారులకి ప్రాంతాల్లేవు… బాలీవుడ్‌ నుంచి నటుల్ని ఎరువు తెచ్చుకుంటున్నా.. వారిలో టాలెంట్‌ని చూడాలి తప్ప.. వారిని పరాయివారిలా చూడరాదన్న విశాల హృదయం తెలుగు ప్రేక్షకులకి వుంది. తమిళ సినీ పరిశ్రమలో అలా కాదు. అక్కడా ఇతర భాషల నుంచి నటీనటుల్ని ఇంపోర్ట్‌ చేసుకోవడం వుంటుందిగానీ, ‘మన’ అన్నదానికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

అసలు విషయంలోకి వస్తే.. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయింది. తెలుగు సినీ పరిశ్రమ మాత్రం.. అలానే వుంది. తెలుగు సినీ పరిశ్రమలో విభజన జరగాల్సిందే అన్న వాదనలున్నా, టాలీవుడ్‌లో ఎవరూ ఈ విభజన సిద్ధాంతానికి మద్దతివ్వడంలేదు. తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌లో స్థిరపడ్డ దరిమిలా.. తెలుగు సినీ ప్రముఖుల్లో మెజార్టీ సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారున్నా.. వారంతా తెలంగాణ సర్కార్‌కి జై కొట్టక తప్పనిపరిస్థితి ఏర్పడింది.

ప్రముఖ తెలుగు సినీ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ ఒకప్పుడు జై ఆంధ్రా ఉద్యమానికి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడాయన ‘హైద్రాబాద్‌ నా సొంతూరు’ అంటున్నారు. చెన్నయ్‌లో 20 ఏళ్ళు, హైద్రాబాద్‌లో 30 ఏళ్ళు తాను వున్నానని, అలా చూస్తే హైద్రాబాద్‌ ఎప్పటికీ తన సొంతూరేనని చెప్పుకుంటున్నారు. మంచిదే.. హైద్రాబాద్‌లో సెటిలైనవారెవరైనా తాము హైద్రాబాదీలమనే అంటారు. అయితే ఒకప్పటి పరిస్థితులకీ ఇప్పటి పరిస్థితులకీ తేడాలున్నాయి.

1956 స్థానికతని తెలంగాణ సర్కార్‌ తెరపైకి తీసుకొచ్చాక.. అది విద్యార్థుల ఫీజు వ్యవహారానికి సంబంధించినదే అయినా, చాలామందిలో ఆందోళన రేకెత్తిస్తోందది. ‘మేం ఎవరం.?’ అని తెలంగాణలో పుట్టి పెరిగిన సీమాంధ్రుల వారసులు అయోమయానికి గురవుతున్నారు. దశాబ్దాలుగా తెలంగాణలో స్థిరపడ్డ తెలంగాణేతరుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందిప్పుడు. ఈ తరుణంలో ‘మా వాయిస్‌ బలంగా విన్పించేదెవరు.?’ అని వారంతా ఆందోళన చెందుతున్నారు.

నిన్న మొన్నటిదాకా సూపర్‌ స్టార్‌ కృష్ణకు చెందిన పద్మాలయా స్టూడియోస్‌ భూముల వివాదంపై తెలంగాణ రాష్ట్ర సమితి పెద్ద పోరాటమే చేసింది. కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తాను సూపర్‌స్టార్‌ కృష్ణకి వీరాభిమానినంటున్నారు. కృష్ణ ఏం తక్కువ తిన్లేదు.. హైద్రాబాద్‌లో తెలంగాణ సర్కార్‌ నిర్మించే సినిమా సిటీకి కేసీఆర్‌ పేరు పెట్టాలంటున్నారు. ఇప్పటిదాకా అయితే ఆంధ్ర, తెలంగాణ అన్న కోణంలో కృష్ణనే కాదు, సినీ పరిశ్రమలో ఎవర్నీ తెలంగాణ – సీమాంధ్ర ప్రేక్షకులు విడిగా చూడలేదు. కానీ నేతల్లానే సినీ జనం కూడా అవసరానికి తగ్గట్టు మాట్లాడుతోంటే, ఆశ్చర్యం కలుగుతోంది అందరికీ. మరీ ముఖ్యంగా సీమాంధ్రులకి.

‘మా బ్రాండ్‌ తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడుంది.?’ అని సీమాంధ్ర (13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌) సినీ జనం ఆవేదన చెందాల్సి వస్తోంది. ‘మేం అందరి వాళ్ళం..’ అనాల్సినోళ్ళు.. అలా వ్యవహరించకపోవడం వల్లే వస్తోంది ఈ చిక్కు అంతా.!