కరోనా వచ్చి టాలీవుడ్ ను పారలైజ్ చేసేసింది. సినిమాల షూటింగ్ లు లేవు. విడుదలలు లేవు. థియేటర్లు మూత పడ్డాయి. సినిమా ఆఫీసుల్లో పనులు లేవు. సినిమా జనాలకు ఆదాయం లేదు. విడుదల కావాల్సిన సినిమాలు డెడ్ క్యాపిటల్ మాదిరిగా వుండిపోయాయి. సరే, జీతాలు భత్యాలు అంటే కోత కోసేవారు కోసి ఇస్తున్నారు. ఇవ్వని వారు ఇవ్వడం లేదు. థియేటర్ల సిబ్బంది, సినిమా రిప్రజెంటేటివ్ ల బతుకులు దారుణంగా వున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తు. సినిమా నిర్మాతల మీద పడుతున్న వడ్డీల భారం మరొక ఎత్తు. ఓ పెద్ద సినిమా నిర్మాణం లేదా ఓ మీడియం సినిమా నిర్మాణం తలెకెత్తుకుంటే ఫైనాన్స్ తేకుండా సాధ్యం కాదు. అది ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా కూడా.. ఇలా తెచ్చిన ఫైనాన్స్ కు వడ్డీ రూపాయిన్నర నుంచి మూడు రూపాయల వరకు వుంటుంది. రూపాయిన్నరకు దొరకడం అన్నది అదృష్టం. నిర్మాతలకు వున్న సర్కిల్ ను బట్టి, రెగ్యులర్ ఫైనాన్సియర్లు కాకుండా బయట 'అదనపు' సంపాదన వున్నవారు ఇస్తుంటారు.
ఏమైతేనే 30 కోట్ల సినిమా అంటే కనీసం 15 కోట్లకు పైగానే ఫైనాన్స్ వుంటుంది. అంటే వడ్డీ ముఫై లక్షల వరకు వుంటుంది నెలకు. అలాంటి సినిమా ఓ మూడు నెలలు ఆగిపోయింది అంటే వడ్డీ భారం ఆ సినిమా మీద కోటి రూపాయల వరకు పడుతుంది. ఇండస్ట్రీలో చాలా సినిమాలు సగంలో, దాదాపు పూర్తి అయి ఆగిపోయినవి వున్నాయి.
పెద్ద బ్యానర్, చిన్న బ్యానర్ అని కాదు, ఇండస్ట్రీలో నెలకు 50 లక్షల నుంచి కోటి రూపాయలు, ఆపైన కడుతున్న బ్యానర్లు కనీసం పది వరకు వున్నాయని అంచనా. ఇంకా చిన్నా, చితక బ్యానర్లు చాలా వున్నాయి. అంటే నెలకు కనీసం పది కోట్ల వరకు టాలీవుడ్ మీద వడ్డీల భారం పడుతుందని అంచనా. ఎందుకంటే నిర్మాణంలో వున్న సినిమాలే కాదు. హీరొలకు, దర్శకులకు ఇచ్చిన అడ్వాన్స్ లు కూడా ఎక్కడో ఒక చోట ప్రాజెక్టు పేరు చెప్పి అప్పు తెచ్చినవే.
అయితే ఇండస్ట్రీలో వున్న ఓ గొప్ప విషయం ఏమిటంటే, ఏదైనా ప్రాజెక్టు పేరు చెప్పి అప్పు తెస్తే, ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేవరకు వడ్డీ లెక్క కట్టడమే తప్ప, ఇవ్వడం వుండదు. అది అలా కొండలా పెరుగుతూవుంటుంది. ఆ భారం అంతా ఆ ప్రాజెక్టు మీద పడుతుంది.
మార్చి 15 నుంచి జూలై 15 వరకు అంటే నాలుగు నెలలుగా దాదాపు టాలీవుడ్ మీద 40 కోట్ల మేరకు వడ్డీ భారం పడి వుంటుందని ఓ అంచనా. ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ విషయమై సమావేశాలు నిర్వహించినా, వ్యవహారం ఓ కొలిక్కి రాలేదని బోగట్టా. ఫైనాన్షియర్లు వడ్డీలు తగ్గించుకుని, తాము నష్టపోవడానికి సిద్దంగా లేము అని క్లారిటీగా చెప్పేసారు అని తెలుస్తోంది. మీకు లాభాలు వచ్చినపుడు మాకేమన్నా పంచారా? అనే టైపులో ఫైనాన్షియర్లు మాట్లాడినట్లు తెలుస్తోంది.
కొన్ని సంస్థలు, ఆగిన ప్రాజెక్టుల విషయంలో ఓ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. వడ్డీలో మూడు వంతుల ఒకభాగం నష్టాన్ని ఫైనాన్షియర్ భరించాలని, మిగిలిన రెండు భాగాల్లో ఒక భాగం హీరో రెమ్యూనిరేషన్ లో కొత పెట్టాలని, ఒక భాగం నిర్మాత భరించాలని ఆ ప్రతిపాదన. నిజానికి ఇది బాగానే వుంది. కానీ అమలు సాధ్యమా కాదా? అన్నది తెలియదు.
మొత్తం మీద మరో రెండు నెలలు కనుక కరోనా కల్లోలం కొనసాగితే టాలీవుడ్ లో కరోనా ఖాతా పద్దు 60 కోట్లు దాటేస్తుందని లెక్కలు కడుతున్నారు ఇండస్ట్రీ జనాలు. వేలు, లక్షల్లో ఆఫీసు అద్దెలు, సగం జీతాలు, కరెంటు బిల్లులు అన్నీ కలుపుకుంటే ఈ పద్దు ఇంకా..ఇంకా ఎక్కువే వుంటుంది.