పేదలకు, స్కూలు పిల్లలకు పళ్లపొడి ఫ్రీ…ఈ స్కీము చెబితే ఇప్పుడు నవ్వలాటగా వుంటుందేమో? కానీ దశాబ్ధాల క్రిందట ఎంజీఆర్ అమలు చేసిన అనేకానేక స్కీముల్లో ఇది ఒకటి. ప్రభుత్వాలు అంటే పన్నులు వసూలు చేసి, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు పోను, మిగిలిన దాంతో అభివృద్ది అనే కార్యక్రమాలు అమలు చేయడం అనే కాన్సెప్ట్ కు, సంక్షేమం అనే అమెండ్ మెంట్ జోడించిన ముఖ్యమంత్రి ఎంజీఆర్.
ఇదే బాటలో కిలో రెండు రూపాయలకే బియ్యం అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది ఎన్టీఆర్. తెలుగునాట కిలో నాలుగు రూపాయలు రేటు వున్నపుడు అందులో సగం ధరకే బియ్యం పేదలకు అందించి, వారి మనసు చూరగొన్నారు.
సంక్షేమం విషయంలో అంతకు మించి ఆయన ఆలోచనలుముందుకు సాగలేదు. సాగే అవకాశం వుండేనేమో? ఆ వెంటనే ఓ సారి పదవి దిగిపోవడం, ఓసారి మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయడం, మరోసారి గద్దె దింపేయడం ఇలా అన్నీ జరిగిపోయాయి.
ఫ్రీ కరెంట్
ఆ తరువాత సంక్షేమం అన్న మాట తెలుగునాట వినిపించలేదు. చంద్రబాబు పాలన వ్యవహారం వేరు. ప్రచారం మూడు వంతులు, పనులు ఒక వంతు అనే పద్దతి. ఆయన విజన్, ఆ హంగామా సంగతి ఇక్కడ అప్రస్తుతం.
అప్పుడు పాదయాత్ర ప్రారంభించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పటి వరకు లేని విధంగా రైతులకు ఫ్రీ కరెంట్ అంటూ ప్రకటన చేసారు. ఈ హామీని ఎంత ఎకసెక్కం చేయాలో అంతా చేసాడు చంద్రబాబు. ఫ్రీగా ఇస్తే అసలు కరెంటే వుండదని, తీగలపై బట్టలు ఆర వేసుకోవడం మినహా మరెందుకు పనికిరావని ఎద్దేవా చేసాడు. కానీ వైఎస్ గెలిచాడు. ఫ్రీ కరెంట్ ఇచ్చి చూపించాడు.
ఫ్రీ వైద్యం
కార్పొరేట్ వైద్యం అంటే ఎంత ఖరీదో అందరికీ తెలుసు. జబ్బు ఎలాంటిదైనా ఆసుపత్రిలో చేరితే కనీసం యాభై వేలు బిల్లు వేయకుండా ఇంటికి పంపరు. లక్షలకు లక్షలు లాగేయాల్సిందే. కానీ పేదవాడికి ఇది ఎలా సాధ్యం. అప్పుడే రాజన్న ఆరోగ్య శ్రీ పురుడుపోసుకుంది. తెల్లకార్డు వున్నవాళ్లకు కూడా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షల ఖరీదైన గుండె ఆపరేషన్లు కూడా పేదవాడికి ఫ్రీగా అందాయి. రెండో సారి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఈ ఆరోగ్యశ్రీ మూడు వంతులు దోహదం చేసింది.
ఫీజులు వెనక్కి
విద్యార్థులు చదువుకంటే ఫీజులువెనక్క ఇచ్చే ఆలోచన చేసింది కూడా రాజన్నే. సాంకేతిక చదువును సామాన్యుడికి చేరువ చేసారు ఈ స్కీముతో. ఇలా సంక్షేమ బాటను కొత్త పుంతలుతొక్కించే పయనంలో అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయి, తిరిగిరాని లోకాలను మరలి రాని పయనమై పోయాడు రాజన్న. సంక్షేమం మీద విజనరీ వుంటూనే, సాగునీటి పై శ్రద్దపెట్టిన ముఖ్యమంత్రి. పోలవరం ప్రాజెక్టు అనుమతి వచ్చేవరకు కూర్చుంటే ఆలస్యం అవుతుందని, కాలవల నిర్మాణానికి అనుమతి అక్కరలేదని, ముందుగావాటి పని ప్రారంభించేసారు. కమిషన్ల కోసం అని ఎద్దేవా చేసిన వారే, తరువాత అధికారంలోకి వచ్చాక, ఆ కాలవలు వాడి స్కీములు పెట్టి, నీళ్లు ఇచ్చి, అపర భగీరధుడిగా ప్రచారం సాగించుకున్నారు. వైఎస్ గురించి ఏం చెప్పాలి. అలాంటి వాళ్ల గురించి ఏం మాట్లాడాలి?
స్నేహం..నమ్మకం
రాజకీయాల్లో నమ్మక ద్రోహాలే తప్ప నమ్మకాలు వుండవు అంటారు. కానీ వైఎస్ దానికి కూడా అతీతమే. నమ్మిన వాళ్లందరినీ చేరదీసాడు. ఆదుకున్నాడు. అది మాత్రమే కాదు వైఎస్ గొప్పదనం. తప్పు చేసిన వాళ్లు అయినా, వైరి పక్షంలో వున్నవాళ్లు అయినా, దగ్గరకు వచ్చి, శరణు అన్నా, మీరే దిక్కు అన్నా, అన్నీ మరిచిపోయి, భుజం తట్టి, తన వెనుక నిలబెట్టుకునే గొప్ప గుణం. అంత గొప్ప క్షమాగుణం ఏ రాజకీయ నాయకుడిలోనూ కనిపించదు.
తెలుగు ఠీవి
తెలుగువాడి ఠీవి అన్న పదం గుర్తుకు వచ్చి, రాజకీయాల్లో దాని గురించి వెదికితే గుర్తు వచ్చేది ఇద్దరు ముగ్గురే. ఎన్టీఆర్, పివి నరసింహారావు. వైఎస్. వీరిలో పివి కి ఠీవి అయిన రూపం లేదు. కానీ ఆ ఆహార్యం వుంది. కానీ ఎన్టీఆర్, వైస్ లకు ఠీవికి దీటైన రూపం కూడా వుంది. నిలువెత్తు మనిషి, నిండైన పంచెకట్టుతో నడచి వస్తుంటే కేంద్రంలో రాజకీయ నాయకులు కూడా వైఎస్ ముందు చిన్నగా కనిపించేవారు.
ఆ ఠీవికి తోడు మొహం మీద చెరగని చిరునవ్వు. ఎవరినైనా పేరు పెట్టి పలుకరించగల జ్ఞాపకశక్తి, భుజం తట్టగల చనువు, ఇవ్వగల భరోసా ఇవన్నీ వైఎస్ సొంతం. తెలుగు రాజకీయాల్లో వైఎస్ ది ఓ చెరగని ముద్ర. అది ఎప్పటికీ తెలుగువాడి జ్ఞాపకాల్లోంచి చెరగిపోదు. అంతకు మించి సంక్షేమ పథకాల విస్తరణ వైఎస్ జగన్ చేపట్టవచ్చు. అంతకు మించిన సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపితే నడపవచ్చు.
సంక్షేమపథంలో రాజశేఖరుడిని మరిపించవచ్చేమో కానీ, ఆయన రూపాన్ని, నడకను, నవ్వును, ఇచ్చే భరోసాను, నమ్మకాన్ని జగన్ నే కాదు, మరే రాజకీయ నాయకుడు మరిపించలేరు. జనం గుండెల్లో అది శాశ్వతం. అలాంటి మరపురాని ప్రజానాయకుడి జయంతి నేడు. ఇది సంస్మరణ కాదు…మరుపురాని మనిషి గురించి మరోసారి మననం చేసుకోవడం మాత్రమే.
ఆర్వీ