బుల్లితెర టాప్ యాంకర్ , నటి ఝాన్సీ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఏడు రోజుల ఇంక్యూబేషన్ పూర్తయినట్టు స్వయంగా ఆమె చెప్పుకొచ్చారు. మరో వారం పాటు ఇంట్లోనే ఉంటానని ఆమె తెలిపారు. ఇటీవల యాంకర్ ఝాన్సీ కరోనా బారిన పడ్డారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఆమె పరోక్షంగా కరోనా బాధితురాలైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అసలేం జరిగిందో ఆమె చెప్పుకొచ్చారు.
తనకు కరోనా సోకిందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఐసోలేషన్‌కు, క్వారంటైన్‌కు తేడా ఉందని ఆమె వివరణ ఇచ్చారు. కరోనా ఎవరికైనా రావచ్చన్నారు. కరోనా సోకిన వారిపై వివక్ష చూపడం సరికాదని ఝాన్సీ అన్నారు.
తాను వర్క్ చేసే సైట్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందన్నారు. అందువల్లే తాను ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చిందన్నారు. రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఇంటికే పరిమితం అయ్యానన్నారు. ఒకవేళ తనకు పాజిటివ్ వస్తే జాగ్రత్తగా ఉంటానని ఆమె అన్నారు. తన ఆరోగ్య విషయమై సోషల్ మీడియాలో చెబుతానన్నారు. కరోనాను జాగ్రత్తగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
ఝాన్సీ కరోనా బారిన పడకుండానే, దాని బాధితురాలు కావడం గమనార్హం. ఎందుకంటే ఆమె కరోనా బారిన పడ్డారనే ప్రచారం ద్వారా అనవసరంగా మానసిక వేదనకు గురి కావాల్సి వచ్చింది. అందుకే ఆమె వార్త రాసే ముందు తెలుసుకోవాలని కోరడం.