శృంగారానికి కేరళ హైకోర్టు సంచలన నిర్వచనం ఇచ్చింది. అలాగే అత్యాచారంపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. 2009 నాటి అత్యాచార కేసుకు సంబంధించి విచారణలో భాగంగా కేరళ హైకోర్టు ఎంతో పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానంపై గౌరవాన్ని పెంచే కేరళ హైకోర్టు తీర్పు గురించి తప్పక తెలుసుకోవాలి.
2009 నాటి అత్యాచార కేసులో నిందితుడు కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు అప్పీల్ చేశాడు. అప్పట్లో ఎనిమిదో తరగతి విద్యార్థిని టీవీ చూసేందుకు నిందితుడి ఇంటికి వెళ్లేది. బాలికకు నిందితుడు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. నిందితుడిని కింది కోర్టు అత్యాచార దోషిగా నిర్ధారించింది. దీంతో అతడు హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు.
తన కోసం బాలిక అనేక మార్లు వచ్చి వెళ్లేదని వాదనకు దిగాడు. పరస్పర అంగీకారంతోనే లైంగిక సంబంధాన్ని కొనసాగించానని చెప్పుకొచ్చాడు. కానీ ఉన్నత న్యాయస్థానం అతని వాదనను పరిగణలోకి తీసుకోలేదు.
ఓ మహిళ పురుషుడికి లొంగిపోయినంత మాత్రాన శృంగారానికి అంగీకరించినట్టు కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. శారీరక సంబంధానికి స్త్రీ ‘ఆహ్వానం’ పలికితేనే ఆమె హక్కులకు భంగం కలగలేదని భావించాలంటూ అత్యాచారానికి సరికొత్త నిర్వచనాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు వెలువరించింది.
మైనర్ బాలిక సమ్మతిని పరస్పర అంగీకారంతో కూడిన కలయికగా పరిగణించలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది. అంతే కాదు, కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. కేరళ హైకోర్టు వెల్లడించిన తీర్పు స్త్రీల హక్కులను కాపాడేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.