తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న తప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కరోనా వైరస్ ను కట్టడి చేసే విషయంలో కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆమె విమర్శించారు.
“ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కెసిఆర్ గారు… కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్‌గా మారింది”
కరోనా విషయంలో కేసీఆర్ ఇన్నాళ్లూ ప్రతిపక్షాల్ని అవహేళన చేశారని, మీడియాను శాపనార్థాలు పెట్టారని ఆరోపించిన విజయశాంతి.. హైకోర్టు తప్పుపట్టినా సీఎం పట్టించుకోవట్లేదన్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యాన్ని కూడా ముఖ్యమంత్రి తప్పుపట్టడం సరికాదన్నారామె.
“ఇక పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ ఇసై సౌందరరాజన్ గారు స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకుంటే… దానిని కూడా సీఎం దొరగారు అడ్డుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారు తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన కారణంగా, గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు సైతం స్వాగతిస్తున్నారు.”
ఇప్పటికైనా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా కేసీఆర్ చర్యలు తీసుకోకపోతే తెలంగాణ సమాజం ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరుతాయంటున్నారు విజయశాంతి.