ఎస్వీ కృష్ణారెడ్డి అంటే ఒకప్పుడు టాప్ హీరో. ఆయన తీసిన అనేక సినిమాలు సూపర్ హిట్ లు. ఆయన సినిమాలో పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ఆయన సినిమాలు వినోదానికి అప్పట్లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. కానీ అంతటి డైరక్టర్ కూడా అప్పట్లో హీరో బాలకృష్ణ (టాప్ హీరో), హీరో నాగార్జున (వజ్రం) లకు డిజాస్టర్ సినిమాలే అందించాడు. ఆ తరువాత తరువాత కృష్ణారెడ్డి మెలమెల్లగా ఫేడవుట్ అయ్యారు. ఆ మధ్య యమలీల 2అంటూ మరోసారి ప్రయత్నించారు కానీ చేదు ఫలితమే మిగిలింది.
ఇదిలా వుంటే, కృష్ణారెడ్డి ఓ మాంచి సబ్జెక్ట్ తో బాలయ్య బాబును ఇంప్రెస్ చేసారు. ఆ సబ్జెక్ట్ ను తన వందో సినిమాగా చేయాలని కూడా అనుకున్నారు బాలకృష్ణ. కానీ ఆ లోగా గౌతమీ పుత్ర శాతకర్ణి సబ్జెక్ట్ రావడం, కృష్ణా రెడ్డి సినిమా వెనక్కు పోవడం జరిగిపోయింది. 103వ సినిమాగా కృష్ణారెడ్డి స్క్రిప్ట్ తెరపైకి వస్తుందని అనుకున్నారు. ఆ మేరకు వార్తలు బలంగా వినిపించాయి.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు పురిట్లోనే ఆగిపోయిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ బాగున్నా, కృష్ణారెడ్డితో సినిమా విషయంలో బాలయ్య సన్నిహితులు ఆయనను వెనక్కు లాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య కుటుంబ సభ్యులకే అవుట్ డేట్ అయిపోయిన కృష్ణారెడ్డితో సినిమా చేయడం ఇష్టం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బాలయ్య చేస్తున్న జై సింహా పూర్తి కావచ్చింది. దాని తరువాత ఏ ప్రాజెక్ట్ ఇంకా ఓకె కాలేదు. కృష్ణారెడ్డి ప్రాజెక్ట్ నే ఊగిసలాడుతోంది. ఆ ప్రాజెక్టు ఒకె అయితే దాని తరువాత ఎన్టీఆర్ బయోపిక్, ఆ తరువాత బోయపాటి సినిమాలు లైన్లో వున్నాయి. మరి కృష్ణారెడ్డి సినిమా వుంటే ఓకె. లేకపోతే ఏ ప్రాజెక్టు సెట్ అవుతుందో మరి? బాలయ్య అయితే చాలా కథలు వింటున్నారని వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.