సినిమా ఫంక్షన్లు రెండురకాలు. పూర్తిగా యూనిట్ కు మాత్రమే పరిమితం అయ్యే ఫంక్షన్లు. స్పెషల్ గెస్ట్ లను తీసుకువచ్చే ఫంక్షన్లు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ రెండో తరహా ఫంక్షన్లకే మొగ్గు చూపిస్తారు. వీలయినంత వరకు సినిమాతో ఏదో విధంగా సంబంధం వున్నవారు మాత్రమే వుండేలా ప్రీ రిలీజ్ లేదా అడియో ఫంక్షన్లు ప్లాన్ చేస్తారు. ఈసారి కూడా అలాగే అనుకున్నారు 'అల వైకుంఠపురములో' సినిమా ఫంక్షన్ గురించి.
కానీ అదే దెబ్బతీసింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, మెగాస్టార్ చిరంజీవిని తమ ఫంక్షన్ కు గెస్ట్ గా ఎగరేసుకుపోయింది 'సరిలేరు నీకెవ్వరు' టీమ్. గత రెండు సినిమాలకు కూడా సరైన వారినికి గెస్ట్ లుగా పిలిచి, సినిమాలకు బజ్ తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాడు మహేష్ బాబు. ఎన్టీఆర్, వెంకీ, విజయ్ దేవరకొండ లను ఆహ్వానించాడు గతంలో. ఈసారి మెగాహీరో బన్నీ సినిమా పోటీగా వస్తుండగా, మెగాస్టార్ ను పిలవడం అన్నది పూర్తిగా స్ట్రాటజిక్ మూవ్ అయింది.
దీంతో బన్నీ టీమ్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. మరెవర్నీ గెస్ట్ గా పిలవలేని పరిస్థితి. ఎవర్నైనా పిలవాలి అంటే మెగాస్టార్ కు దీటుగా వుండాలి. పవర్ స్టార్ తప్ప మరెవరు లేరు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది అంత పాజిటివ్ సైన్ కాదు. అందుకే రకరకాలు ఆలోచించి, ఆఖరికి యూనిట్ కే పరిమితం కావాలని డిసైడ్ అయిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ తో ఫంక్షన్ చేసి, మహేష్ టీమ్ మార్కులు కొట్టేసింది. ఒక రోజు తేడాతో ఫంక్షన్లు వుండడంతో, మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ అన్ని ప్రాంతాల నుంచి ఓ రోజు ముందు వచ్చేసి, మహేష్ ఫంక్షన్ కు కూడా వెళ్లారు. మెగాస్టార్ వుండడమే అందుకు కారణం. అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ కలిసి, 'సరిలేరు నీకెవ్వరు' ఫంక్షన్, సరిలేదు అన్నట్లు జరిగింది.
మామూలుగా గీతా సంస్థ ప్లానింగ్ అంటే వేరుగా వుండేదేమో? హారిక హాసిని, అది కూడా పూర్తిగా త్రివిక్రమ్ మాట మీదే ఆధారపడి వుండడంతో, ఇన్ టైమ్ లో డెసిషన్ తీసుకోకపోయారు. రిలీజ్ డేట్ విషయంలోనే కాదు, ఫంక్షన్ విషయంలో కూడా వెనుకబడిపోయారు.