వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయలేదు. కనీసం మెగా కాంపౌండ్ లో కూడా అడుగుపెట్టలేదు రష్మిక. అయినా చిరంజీవి-రష్మిక మధ్య ఓ గోల్డెన్ కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏంటనేది రష్మిక స్వయంగా బయటపెట్టింది. తన సినిమా ఫంక్షన్ కు చిరు వస్తే సినిమా హిట్ అంటోంది రష్మిక.
“ఛలో సినిమా ఫంక్షన్ కు చిరు సర్ వచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. గీతగోవిందం ఫంక్షన్ కు కూడా వచ్చారు. అది కూడా హిట్టయింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ కు కూడా వచ్చారు. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. చిరంజీవి సర్ నాకు లక్కీ ఛార్మ్.”
సరిలేరు నీకెవ్వరు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ విషయాన్ని బయపెట్టింది రష్మిక. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ భారీ ఫంక్షన్ కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ వేదికపై మాట్లాడిన చిరంజీవి కూడా రష్మిక చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. రష్మిక తనను కాంట్రాక్ట్ గా తీసుకుందేమోనని సరదాగా జోక్ చేశారు.
“అదేంటో రష్మిక నన్ను కాంట్రాక్ట్ తీసుకుందేమో అనిపిస్తోంది. ఛలో సినిమాకు నన్ను ఎవరో పిలిచారాని వెళ్లాను. అక్కడుంది ఈ అమ్మాయి. తర్వాత గీతగోవిందం ఫంక్షన్ కు వెళ్లాను. మా గీతాఆర్ట్స్ ఫంక్షన్ అని వెళ్లాను. అక్కడ కూడా ఉంది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఈ ఫంక్షన్ కు వస్తే, ఇక్కడ కూడా ఇదే అమ్మాయి. ఏమ్మా.. నన్ను కాంట్రాక్ట్ పుచ్చుకున్నావా.”
ఇలా చిరంజీవి-రష్మిక మధ్య పైకి కనిపించని ఓ బాండింగ్ ఫంక్షన్ లో బయటపడింది. అయితే రష్మిక పేరును సంబోధించడంలో మాత్రం చిరంజీవి తడబడ్డారు. ఒకసారి రష్మీ అన్నారు. ఆ తర్వాత రష్మిక అన్నారు. ఆమె పూర్తిపేరును పూర్తిగా తప్పుగా ఉచ్ఛరించారు.