దాదాపు దశాబ్దంన్నర కిందట రజనీకాంత్ చేసిన సినిమా చంద్రముఖి. రజనీకెరీర్ కు సెకెండ్ ఇన్నింగ్స్ లాంటిది ఆ సినిమాతోనే మొదలైంది. పదిహేనేళ్ల కిందటి చిన్న పిల్లలకు కూడా రజనీకాంత్ చేరువ అయ్యింది ఆ సినిమాతోనే. అలా ఆ సినిమాతో రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు అయ్యింది. సౌత్ లో సూపర్ హిట్ గా నిలిచింది చంద్రముఖి. ఆ సినిమా దర్శకుడు పి.వాసుతో ఆ తర్వాత రజనీకాంత్ వర్క్ చేశారు. కథనాయకుడు సినిమాలో కనిపించారు.
ఆ కథనాయకుడులో కూడా చంద్రముఖి 2 ప్రస్తావన ఉంటుంది. మరోవైపు పీ వాసు ఆ సినిమాకు ఒక సీక్వెల్ చేశారు. కన్నడలో ఆ సినిమాను రూపొందించారు. విష్ణువర్దన్ నటించిన ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. దాన్ని తెలుగులో వాసు రీమేక్ చేశారు. వెంకటేష్ హీరోగా నాగవల్లి పేరుతో ఆ సినిమా వచ్చింది. ఆడలేదు.
అయితే రజనీకాంత్ కు మాత్రం చంద్రముఖి సీక్వెల్ మీద బాగా ఇష్టం ఉన్నట్టుంది. ఇటీవలే ఆ అంశాన్ని మురుగదాస్ చెప్పారు. తను రజనీకాంత్ తో చేయాలనుకున్నది దర్బార్ సినిమా కాదని, చంద్రముఖి సీక్వెల్ చేయాలని అనుకున్నట్టుగా మురుగ చెప్పారు. అయితే చంద్రముఖి సీక్వెల్ చేస్తే.. అది ప్రభు బ్యానర్ మీద రూపొందాలి, అలాగే పీ వాసుకు ఇన్ఫార్మ్ చేయాలి.. తమకు ఒప్పందం లైకాతో ఉంది. దీంతో ఆ ఆలోచన నుంచి డ్రాప్ అయినట్టుగా మురుగదాస్ చెప్పారు.
మరోవైపు చంద్రముఖికి సీక్వెల్ రెడీ అంటున్నారు పీ వాసు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయ్యిందని ఆయన ప్రకటించారు. ఇది వరకూ దానికి ఒక సీక్వెల్ చేసి అంతగా ఆకట్టుకోలేకపోయిన వాసు, ఇప్పుడు మళ్లీ రెడీ అంటున్నారు. రజనీకాంత్ కు చంద్రముఖి సీక్వెల్ మీద ఆసక్తే ఉన్నట్టుంది కాబట్టి.. రజనీ వెర్షన్ రాబోతోందేమో!