త్రివిక్రమ్ ను దెబ్బతీసిన వాస్తు?

టాలీవుడ్ లో నమ్మకాలు ఎక్కువ. ఆ మాటకు వస్తే ఈ కాలంలో జనాలకు వాస్తు, ముహూర్తాల నమ్మకాలు ఇంకా ఎక్కువ. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మహూర్తాలు, హోమాలు, జపాలు ఇలాంటి నమ్మకాలు చాలా…

టాలీవుడ్ లో నమ్మకాలు ఎక్కువ. ఆ మాటకు వస్తే ఈ కాలంలో జనాలకు వాస్తు, ముహూర్తాల నమ్మకాలు ఇంకా ఎక్కువ. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మహూర్తాలు, హోమాలు, జపాలు ఇలాంటి నమ్మకాలు చాలా ఎక్కువ. ఆయనకు ఓ గురువుగారు కూడా వున్నారు.

ఆయన ద్వారానే ఆ గురువుగారు అనేక మంది బడా సినీ సెల్రబ్రిటీలకు పరిచయం అయ్యారు. వాళ్లందరి కోసం సదరు గురువుగారు భారీ హోమాలు జరిపిస్తుంటారని వినికిడి.

అయితే, ఇవన్నీ ఇలా వుంచితే, ఒక్కసారిగా తేరుకోలేని, భయంకరమైన పరాజయాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చవిచూడడం వెనుక వేరే విషయం వుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఆయన కొత్తగా కట్టుకున్న ఇల్లు.

ఈ ఇల్లు వున్న వీధి అలాంటిది అని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. ఈ వీధి ఫిల్మ్ నగర్ లోని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ కార్యాలయం ఎదురుగా వుంటుంది. ఈ వీధిలో ఇల్లు కట్టుకున్న చాలామంది సినిమా సెలబ్రిటీలు దారుణమైన పరాజయాలు చవి చూసి, ఇల్లు అమ్మేసుకుని బయటకు వచ్చారని వినిపిస్తోంది.

ఇలా ఆ వీధిలోకి వెళ్లి దారుణమైన పరాజయాలు చవిచూసిన వారిలో అశ్వనీదత్, బెల్లంకొండ సురేష్ లాంటి నిర్మాతలు కూడా వున్నారంటున్నారు. అయితే ఆ వీధిలో త్రివిక్రమ్ ఇల్లు మంచి ప్లేస్ లోనే వుందని, దానికి వాస్తు సమస్యలు లేవనీ కూడా వినిపిస్తోంది. కానీ ఆ వీధి సినిమా జనాలకు అచ్చిరావడం లేదనీ వినిపిస్తోంది.

అ..ఆ టైమ్ లో ఇల్లు కట్టడం ప్రారంభించి, అజ్ఞాతవాసి నిర్మాణంలో వుండగానే త్రివిక్రమ్ ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసారు. ఆ ఇల్లు ఇంటీరియర్ వర్క్ ఇంకా పూర్తికాలేదు కూడా. ముంబాయి, పూనె తదితర ప్రాంతాలకు చెందిన నిపుణులతో ఇంటీరియర్ వర్క్ చేయిస్తున్నారు. ఇంటీరియర్ పనిపై ఓసారి ఇటలీకి కూడా వెళ్లి వచ్చారు. అయితే అజ్ఞాతవాసి ఫలితం తరువాత పనులు ఆపేసినట్లు వినికిడి.

ఎవరి నమ్మకాలు వారివి. ఏ వీధిలో ఏముందో? ఎవరికి ఎరుక?