త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్. మాటల మాంత్రికుడు. హీరో ఎవరైనా.. కేవలం తన పేరుబలం మీదే సినిమాని హిట్ చేయగల మేధావి. అలాంటి త్రివిక్రమ్ కి ఓ అలవాటుంది. అది అలవాటో లేక మహిళలపై అతనికి చులకన భావనో తెలియదు కానీ హీరోయిన్ క్యారెక్టర్లని చాలా అమాయకంగా తీర్చిదిద్దుతారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
తన కథల్లో హీరోలని అత్యంత మేథావులు, కండబలం, గుండెబలం కలిగినవారిగా చూపించే ఈయన, హీరోయిన్ల విషయానికొచ్చే సరికి తెలివితక్కువ దద్దమ్మల్లాగా, కేవలం హీరో వెంటపడి ఆయన ప్రేమని గెలిపించుకోవడమే జీవిత పరమావధిగా పెట్టుకునేవారిలాగా చూపిస్తాడు. త్రివిక్రమ్ చేసిన అన్ని సినిమాల్లోనూ దాదాపు హీరోయిన్లది ఇదే పరిస్థితి.
తన తొలి సినిమాలో శ్రియని మట్టిబుర్రగా చూపించి కామెడీ పండించిన త్రివిక్రమ్.. అతడులో త్రిష, జల్సాలో ఇలియానా, ఖలేజాలో అనుష్క.. చెప్పుకుంటూ పోతే అందర్నీ ఇలాగే స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ.. సినిమాల పేర్లు మారినా.. హీరోయిన్ సమంతకి మాత్రం ఒకే టైప్ రోల్స్ ఇచ్చాడు. హీరో వెంటపడటం, అతని ప్రేమకోసం ఆరాటపడటం, బేల చూపులు, అమాయకపు చేష్టలు.. సింపుల్ గా సమంతకి త్రివిక్రమ్ ఇచ్చిన క్రెడిట్స్ ఇవి.
లేటెస్ట్ రిలీజ్ అజ్ఞాతవాసిలో కూడా ఇద్దరు హీరోయిన్లనీ ఇలాగే ప్రజెంట్ చేశాడు త్రివిక్రమ్. పవన్ చెప్పే కట్టుకథల్ని నమ్మి ఇనిస్టెంట్ గా లవ్ లో పడిపోయి, అతడి చుట్టూ తిరిగి, చివరకి అతడి కోసం సిగపట్లు పట్టుకునే రేంజ్ కు తీసుకెళ్లాడు. ఇప్పుడీ త్రివిక్రమ్ నుంచి మరో సినిమా వస్తోంది. అదే అరవింద సమేత. మరి ఇందులో హీరోయిన్ పరిస్థితేంటి.. ?
ఎన్నడూ లేనిది సినిమా టైటిల్ లో హీరోయిన్ రోల్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, కథలో కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చాడా అనేది డౌట్. ఒకవేళ కథలో ప్రాథాన్యత ఇచ్చినా.. యధావిధిగా హీరోయిన్ ని అత్యంత బేలగా, హీరో వెంటతిరిగే సామాన్య పాత్రగా చిత్రీకరిస్తాడా లేక హీరోయిన్ ని కూడా హీరో అంత స్ట్రాంగ్ గా ప్రజెంట్ చేస్తాడా అనేది తేలాల్సి ఉంది.
టీజర్ విడుదలైతే అరవింద సమేత సినిమాపైనే కాదు, త్రివిక్రమ్ సృష్టించే హీరోయిన్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఈ అనుమానాలు కొంచమైనా తీరే అవకాశం ఉంది. ఏదేమైనా హీరోల్ని ఆకాశమంత ఎత్తులో చూపించే త్రివిక్రమ్, హీరోయిన్లను మాత్రం ఏనాడూ ఉన్నతంగా చూపించలేదు.