అర్జున్ రెడ్డితో దేవరకొండ బ్లాక్ బస్టర్ అందుకున్న రోజులవి. ఆ టైమ్ లో అతడితో సినిమా చేసేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అర్జున్ రెడ్డి రిలీజ్ కు ముందే అల్లు అరవింద్ కూడా దేవరకొండతో రెండు సినిమాలకు ఒప్పందం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో త్రివిక్రమ్ దగ్గరకు కూడా దేవరకొండ హీరోగా ఓ ఆఫర్ వచ్చింది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే త్రివిక్రమ్-దేవరకొండ కాంబోలో సినిమా ఈపాటికి రిలీజై ఉండేది. కానీ ఆ ప్రాజెక్టు తృటిలో చేజారిపోయింది. ఈ ఎక్స్ క్లూజివ్ డీటెయిల్స్ ను స్వయంగా డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల వెల్లడించాడు. త్రివిక్రమ్-దేవరకొండ కాంబోపై మాట్లాడాడు.
“నందినీ రెడ్డి ఓ కథ రాసుకున్నారు. దానికి స్క్రీన్ ప్లే కూడా ఆమెదే. ఆ కథ పట్టుకొని త్రివిక్రమ్ ను కలిశారు. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తే బాగుంటుందని కోరారు. కానీ కథలో ఎక్కువ లేయర్స్ ఉన్నాయని, విజయ్ దేవరకొండతో పాటు మరికొంతమంది హీరోలు కూడా అవసరమని త్రివిక్రమ్ అన్నారు. పైగా అప్పటికే త్రివిక్రమ్ పెద్ద సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ స్టోరీని పక్కనపెట్టారు.”
అలా పక్కనపడేసిన కథ స్వప్నదత్ మూలంగా మళ్లీ బయటకు వచ్చిందని, అంతేకాకుండా ఓ కొత్త రూపం సంతరించుకుందని చెప్పుకొచ్చాడు లక్ష్మీ భూపాల. “ఆ తర్వాత ఆ కథ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఓ సందర్భంలో స్వప్న దత్, ఆ కథను బయటకు తీయమని నందినీరెడ్డికి చెప్పారు. దాన్ని వెబ్ సిరీస్ గా మలచమని కోరారు. అప్పుడు ఆ ప్రాజెక్టుకు నేను డైలాగ్స్ రాశాను. అలా ఓ మల్టీస్టారర్ కథ ఓ పెద్ద వెబ్ సిరీస్ గా మారింది. అదే గ్యాంగ్ స్టార్స్.”
విజయ్ దేవరకొండ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేద్దామనుకున్న ఆ కథ తర్వాత వెబ్ సిరీస్ గా మారిన విషయాన్ని లక్ష్మీభూపాల వెల్లడించాడు. మల్టీస్టారర్ సినిమాగా చేయడానికి ఆ వెబ్ సిరీస్ కు ఇప్పటికీ అన్ని అర్హతలు ఉన్నాయంటున్నాడు ఈ రచయిత.