సినిమా జనాలకు సెంటిమెంట్లు ఎక్కువ. అదృష్టం కూడా వుంటే ఎలాంటి సినిమాలు చేసినా, ఏంచేసినా, సక్సెస్ కొడుతూనే వుంటారు. అదే తేడాగా వుంటే ఎంత ప్రయత్నించినా, వికటిస్తూ వుంటుంది. టాలీవుడ్ లో అలాంటి బ్యానర్లు రెండు వున్నాయి.
ఒకటి దిల్ రాజు బ్యానర్. లాస్ట్ ఇయర్ ఆయనకు డిస్ట్రిబ్యూషన్ శాపమైంది. నిర్మాణం వరమైంది. ఈ ఏడాది రెండూ కలిసి రాలేదు పెద్దగా ఇప్పటి వరకు. రెండో బ్యానర్. యువి క్రియేషన్స్. ఈ సంస్థ పెద్దగా హడావుడి చేయకుండా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తొంది.
ఎక్కడా దెబ్బ పడలేదు. ఆఖరికి దెబ్బ పడుతుంది అనుకున్న టాక్సీవాలా కూడా హిట్ అయికూర్చుంది. ఆ సినిమా రేంజ్ కు మంచి ఫలితాలే నమోదు చేసింది. పైగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఈ సంస్థ కాస్త జోరుమీదే వుంది.
ఇప్పుడు ఈ రెండు బ్యానర్లు కలిసి, ఎన్వీప్రసాద్ తో చేతులు కలిపి రోబో 2.0 సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు తీసుకున్నాయిు. యువి వంశీ, దిల్ రాజు, ఎన్వీప్రసాద్ ముగ్గురూ ఇటు నిర్మాణ రంగంలో, అటు డిస్ట్రిబ్యూషన్ లో, థియేటర్ల నిర్వహణలో కాకలు తీరినవాళ్లే.
కానీ ఈ ప్రాజెక్టు చాలా రిస్క్ తో కూడుకున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 80కోట్లు వసూలు చేయాల్సి వుంది. ఆంధ్రలో 40, సీడెడ్ లో 15, నైజాంలో 25 కోట్లకు పైగా వసూళ్లు సాగించాల్సి వుంటుంది. ఇది చాలా రేర్ ఫీట్.
కానీ హిట్ అయితే, రజనీ-శంకర్ కాంబినేషన్ లో సినిమా కాసులు కురిపిస్తుంది. అందులో సందేహం లేదు. అదే ఈ ముగ్గురు బయ్యర్ల ధీమా కూడా. యువి అదృష్టం ప్రకారం ఈ ఫీట్ సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాలి మరి.
కులం చెడ్డా సుఖం దక్కుతోందా! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్