వెనక్క తగ్గుతున్న అమెజాన్?

కరోనా టైమ్ లో ఎక్కువ పాపులర్ అయిన పదం ఓటిటి. థియేటర్లు ఎప్పుడు తీస్తారో తెలియదు. జనం థియేటర్లకు ఎలా వస్తారో తెలియదు? అందువల్ల రెడీగా వున్న సినిమాలు ఓటిటి లో నేరుగా విడుదల…

కరోనా టైమ్ లో ఎక్కువ పాపులర్ అయిన పదం ఓటిటి. థియేటర్లు ఎప్పుడు తీస్తారో తెలియదు. జనం థియేటర్లకు ఎలా వస్తారో తెలియదు? అందువల్ల రెడీగా వున్న సినిమాలు ఓటిటి లో నేరుగా విడుదల చేస్తే బెటర్ అన్న వాదన ఒకటి బయల్లేరింది. దాంతో ఈ సినిమా ఇంతకు కొంటున్నారు, ఆ సినిమా అంతకు కొంటున్నారు అంటూ వార్తలు పుట్టుకోచ్చాయి. కరోనా మొత్తం దాదాపుగా అయిపోయింది. మరో కొన్ని వారాల్లో థియేటర్లు ఎలాగూ తెరుస్తారు. అయినా ఇప్పటికీ ఏ ఒక్క తెలుగు సినిమా కూడా  నేరుగా ఓటిటికి వెళ్లలేదు.

నిశ్ళబ్దం, మిస్ ఇండియా సినిమాలు వెళ్తాయని ఇప్పటికీ బలంగానే వినిపిస్తోంది. కానీ మరోపక్క అమెజాన్ ప్రయిమ్ ఈ విషయంలో పునరాలోచనలో పడిందనీ వినిపిస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రయిమ్ జ్యోతిక తమిళ సినిమా పొన్మగళ్ వందాళ్ ను ఏడు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. నేరుగా ఓటిటిలో విడుదల చేసింది. బ్యాడ్ లక్ ఏమిటంటే ఈసినిమా జనాలను అంతగా ఆకట్టుకోలేదు. దాంతో ఇప్పుడు అమెజాన్ ప్రయిమ్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. 

పొన్మగళ్ వందాళ్ సినిమా ఎలా వుంది, టాక్ ఏమిటి? అన్న సంగతి పక్కన పెట్టి, నేరుగా విడుదల చేసినందున ఆ మేరకు తేడా ఏమన్నా వుందా? లేదూ, మాములుగా థియేటర్ లో విడుదల చేసిన తరువాత విడుదల చేస్తే వచ్చే రెస్పాన్స్ మాదిరిగానే వుందా? అన్నది అమెజాన్ సంస్థ లెక్కలు  వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత కమర్షియల్ వెయిబులిటీ లెక్కలు చూస్తారు.

అప్పుడు కానీ తెలుగులో నేరుగా విడుదల చేసే సినిమాలు కొనడం, ఏ రేటుకు కొనడం, ఏ టెర్మ్స్ మేరకు కొనడం వంటి సంగతులు ఫైనల్ చేస్తారు.  ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే తెలుగు సినిమాలకు రేట్లు మాత్రమే కీలకం కాదు. టెర్మ్స్ కూడా. ఓటిటిలో విడుదలయినా యాభై రోజుల తరువాత థియేటర్ లో మళ్లీ వేసుకుంటే బాగుంటుందన్నది నిర్మాతల ఆలోచనగా వుంది. దానికి అమెజాన్ ఒప్పుకోవాల్సి వుంది. ఇవన్నీ ఇలా వుంచితే అమెజాన్ ప్రయిమ్ ఇచ్చినదంతా నేరుగా నిర్మాతల చేతిలో పడదు. ఇక్కడ వ్యవహారాలు డీల్ చేసే మధ్యవర్తులు వున్నారు. వాళ్లకు తృణమో, పణమో కమిషన్ వుంటుంది. అందువల్ల రేట్లు మరీ తగ్గిస్తే నిర్మాతలు ముందుకు రాకపోవచ్చు.

మొత్తం మీద మరో వారం పది రోజుల వరకు విషయం తేలదు. తమిళ సినిమా లెక్కలు, లాభ నష్టాలు తేల్చుకుని, ఆ మేరకు తెలుగు సినిమాల రేట్లు చూసుకుని అప్పుడు అమెజాన్ ప్రతినిధులు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. అప్పటి వరకు తెలుగు సినిమాలు వెయిట్ చేయాల్సిందే.

మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను