రిలయన్స్ వారసులు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీల్లో ఒకరిది విజయగాథగా సాగుతూ ఉంటే, మరొకరిది ఫెయిల్యూర్ స్టోరీ అనే అభిప్రాయాలు ప్రజల్లో ఏర్పడుతూ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రిల్), అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(అడాగ్) ల పేరుతో వీరిద్దరూ వేరవ్వడం, ఆ తర్వాతి పరిణామాలు మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలుస్తున్నవే. తండ్రి పోయిన కొన్నేళ్లకు ఈ అన్నదమ్ములిద్దరి ప్రస్థానం వేర్వేరుగా సాగింది. ఇద్దరూ భారీ వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఒకరికి కొన్ని కలిసి వచ్చాయి, మరొకరికి నష్టాలు భారీ స్థాయిలో సంభవించాయి. దీంతో ముకేష్ అంబానీ ప్రపంచ శ్రీమంతుల్లో ఒకరిగా నిలుస్తుండగా, అనిల్ అంబానీ గ్రూప్ అప్పులతో వార్తల్లో నిలుస్తూ ఉంది.
ఒక దశలో అప్పుల విషయంలో అనిల్ అంబానీకి ఒత్తిడి మరీ ఎక్కువైందనే వార్తలూ వచ్చాయి. ఎంతలా అంటే.. 560 కోట్ల రూపాయల మొత్తాన్ని తక్షణం కట్టలేని పరిస్థితుల్లో ఆయన అరెస్టుకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ఆయనను అన్న ముకేష్ అంబానీనే ఆదుకున్నట్టుగా బ్లూమ్ బర్గ్ ఒక ఆసక్తిదాయకమైన కథనాన్ని ఇచ్చింది.
560 కోట్ల రూపాయలు అంటే మాటలేమీ కాదు. అది ఎంత పెద్ద వ్యాపార వేత్తకు అయినా భారీ మొత్తమే! అలాంటి భారీ మొత్తాన్ని తమ్ముడిని ఆదుకోవడానికి వెచ్చించాడట ముకేష్ అంబానీ. ఆ రకంగా చూస్తే ముకేష్ అంబానీ మనసు చాలా గొప్పదనే అనుకోవాలి. తమ్ముడి అరెస్టు వరకూ వచ్చేసరికి ఆయన 560 కోట్ల రూపాయల మొత్తంతో చక్రం వేశాడంటే గొప్ప సంగతే! అయితే అది అంత తేలికగా జరగలేదు అని అంటోంది బ్లూమ్ బర్గ్.
డబ్బు విషయంలో తమ్ముడి చేత ఆల్మోస్ట్ బెగ్గింగ్ చేయించుకున్నాడట ముకేష్ అంబానీ. సాయం చేయమని అనిల్ తన అన్నను బెగ్ చేసే పరిస్థితులు అప్పుడు ఏర్పడ్డాయని బ్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది. అనేక చర్చోప చర్చల తర్వాత, తీవ్ర తర్జనభర్జనల తర్వాత అనిల్ అంబానీకి 560 కోట్ల రూపాయల మొత్తాన్ని సర్దేందుకు ముందుకు వచ్చాడట ముకేష్. అయితే ఆ డబ్బు కూడా ఏదో ఉచితంగా ఇవ్వలేదని కూడా బ్లూమ్ బర్గ్ పేర్కొంది. ముంబైలో అనిల్ అంబానీ గ్రూప్ కు సంబంధించిన భవనాలను వాడుకునే షరతు పెట్టారట. ఏకంగా 99 సంవత్సరాల పాటు ఆ భవనాలను లీజుకు రాయించుకున్నాడట ముకేష్ అంబానీ. అడాగ్ కు చెందిన ఆ భవనాల లీజు పత్రాలపై సంతకాలు పెట్టి అన్న నుంచి 560 కోట్ల రూపాయల మొత్తాన్ని సాయంగా పొందాడట అనిల్. మరి ఏ అన్నా తమ్ముడికి సాయం చేయలేని రీతిలో 560 కోట్ల రూపాయల మొత్తాన్ని సర్ధిన ముకేష్ గొప్ప అన్నగా నిలుస్తాడా, లేక పక్కా వ్యాపారిగా అడాగ్ కు సంబంధించిన బిల్డింగులను లీజుకు రాయించేసుకుని డబ్బులు సర్ధిన వ్యాపారిగా నిలుస్తాడా?