ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, వెంకన్నతో కాదు. ఆయనకు రూపాయి బాకీ పడినా వడ్డీతో సహా వసూలు చేస్తాడు. ఆయనతో జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. నిజమే. హిందువుల నమ్మకాల ప్రకారం ఇది నూటికి నూరు పాళ్లు నిజం. మరి అలా అని వెంకన్న డబ్బులు తినేస్తే ఫరావాలేదా?
వెంకటేశ్వర భక్తి చానెల్ ను గత మూడేళ్లుగా దర్శకుడు రాఘవేంద్రరావు, కీరవాణి తదితరులు కలిసి ఆ చానెల్ ను దాదాపు తమ స్వంత కార్యక్రమాలతో నింపేసారని విమర్శలు వున్నాయి. మరి వీటిని ఫ్రీగా చేస్తున్నారా? ఖర్చులు రాస్తున్నారా? ఏ లెవెల్ లో రాస్తున్నారు? వీటిపై ఎప్పుడన్నా దృష్టిపెట్టారా?
తిరుమలలో పోటును తవ్వేసారని, ఎందుకు తవ్వారని అడుగుతున్నారు. గులాబి వజ్రం లేకుండా పోయిందంటున్నారు. అలాగే అసలు కృష్ణదేవరాయలు నగలు ఏవో తెలియవంటున్నారు. నయమే, ఇంకా కృష్ణదేవరాయలు ఎవరో తెలియదని అనలేదు. అందరూ ఒకె అంటే నగలు బయటపెడతాం అంటున్నారు.
అసలు నగలు, ఆభరణాల మీద పబ్లిక్, సోషల్ ఆడిట్ చేయించవచ్చు కదా? అన్ని పార్టీల నాయకులతో, ప్రజా సంఘాల ప్రతినిధులతో ఓ కమిటీ వేసి, మొత్తం నగలు ఎన్ని వచ్చాయి. ఎన్ని వున్నాయి. ఎన్ని కరిగించారు. ఇవన్నీ నిగ్గు తేల్చవచ్చు కదా?
భాజపా చేయిస్తోంది. లేదా ఇంకొకరు చేయిస్తున్నారు అని అనే బదులు నిజం నిగ్గు తేల్చవచ్చు కదా? అసలు ఏ లాభం లేకుండా ఎందుకు రాజకీయ జనాలు అంతా టీటీడీ చైర్మన్ పదవి కావాలని వెంపర్లాడుతున్నారు? ఇదంతా స్వామి సేవ కోసమే నా? అంటే చైర్మన్ పదవి లేకుండా స్వామి సేవ చేయలేరా? అడ్డదారిలో ఎల్ వన్ దర్శనాలు కొట్టేసి, విఐపి దర్శనాలు చేయించేసుకుంటే స్వామి ఏమీ అనరా? కేవలం వెంకన్న సన్నిధిలో అక్రమాలు జరుగుతున్నాయి అని బయటపెడితేనే స్వామికి కోపం వస్తుందా?
ఏం మాట్లాడుతున్నారు బాబు గారూ? ఆరోపణలు వస్తే, ప్రత్యారోపణలు చేయడం కాదు. సరైన వివరణ ఇవ్వడం అవసరం. ఇది ఇన్నేళ్ల అనుభవంలో మీకు తెలియదనే అనుకోవాలా?