మంచి సెన్సిబుల్ డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కేవలం బ్రహ్మోత్సవం సినిమా బ్యాక్ ఫైర్ కావడంతో ఆయన మూడేళ్లుగా అలా మూలన వుండిపోయారు. ఎందరో ఫ్లాఫు డైరక్టర్లకు చాన్స్ లు ఇస్తున్నారు కానీ పాపం, శ్రీకాంత్ అడ్డాలను మాత్రం అలాగే వదలేసారు.
ఆయన తీసినవి నాలుగే సినిమాలు. వాటిల్లో రెండు హిట్ లు. ఒకటి యావరేజ్. కానీ ఇవేవీ కౌంట లోకి రాలేదు. డిజాస్టర్ బ్రహ్మోత్సవం మాత్రమే లెక్కలోకి వచ్చేసింది. దాంతో చాన్స్ లు లేకుండా అలా వుండిపోయారు.
ఈ వ్యవహారం నేపథ్యంలో శ్రీకాంత్ అడ్డాల ఇటీవల హీరో వెంకటేష్ ను కలిసినట్లు తెలుస్తోంది. వెంకీకి శ్రీకాంత్ మీద మంచి అభిప్రాయమే వుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసారు కదా. ప్రస్తుతం వెంకీ అసురన్ రీమేక్ మీద దృష్టి పెట్టారు. దాని కోసం దర్శకుడిని వెదుకుతున్నారు. చాలా మంది యంగ్ డైరక్టర్లకు సినిమా చూపించారు. అభిప్రాయాలు సేకరించారు.
ఈ సంగతి తెలిసి శ్రీకాంత్ అడ్డాల వెంకీని కలిసినట్లు తెలుస్తోంది. అసురన్ ఓ భిన్నమైన సినిమా. మానవ సంబంధాలు, భావోద్వేగాలు కూడా అంతర్లీనంగా వుంటాయి. బహుశా ఈ అంశమే శ్రీకాంత్ అడ్డాలను కూడా ముందుకు తోసి వుంటుంది. అయితే వెంకీ ఏమన్నారో? ఏమయిందో? అన్నది ఇంకా తెలియదు.
ప్రస్తుతానికి అయితే హను రాఘవపూడి పేరే ఎక్కువగా వినిపిస్తోంది అసురన్ రీమేక్ కు. అజయ్ భూపతి, సాగర్ చంద్ర ఇలాంటి యంగ్ డైరక్టర్ల పేర్లు కూడా పరిశీలించారు. అజయ్ భూపతి అయితే చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వుంటుంది మాతృకకు లేదా అంటే తెలుగుకు సెట్ కాదు అని చెప్పినట్లు బోగట్టా.
మరి ఇలాంటి నేపథ్యంలో శ్రీకాంత్ అడ్డాలకు అవకాశం ఎంతవరకు వుంటుందో చూడాలి.