Advertisement

Advertisement


Home > Politics - Gossip

కాష్టం చల్లారడం వారికి ఇష్టం లేదా?

కాష్టం చల్లారడం వారికి ఇష్టం లేదా?

మంచి చెడుల ప్రస్తావన కాసేపు పక్కన పెడితే.. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో... రెండు బలమైన వర్గాల మధ్య కొంత అసహనం, అపనమ్మకం ప్రబలి ఉండడానికి కారణంగా ఉన్న సమస్యపై సుప్రీం ధర్మాసనం.. ఒక తీర్పు వెలువరించింది.

ఒకరికి అనుకూలంగా- ఒకరికి ప్రతికూలంగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తం కావడమే కరెక్టు కాదు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అన్ని మతాలు దీనిని హర్షించాయి. దేశంలో సౌహార్ద వాతావరణం ఉండడానికి ఏదో ఒక తీర్పు.. దానిని అందరూ అనుసరించాలనే అంతా అనుకున్నారు.

కానీ.. ఇప్పుడు మళ్లీ ముసలం కొత్తగా పుట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ తీర్పుపై సమీక్ష కోరుతూ పిటిషన్ వేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించడం సబబు కాదని అనిపిస్తోంది.

నిజానికి తీర్పు పట్ల ముస్లిం వర్గాల్లో కూడా మెజారిటీ నాయకుల్లో, మేధావుల్లో హర్షం వ్యక్తం అయింది. కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూనే.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. పాటిస్తాం అని అన్నారు. కానీ.. దీని సమీక్ష కోరుతూ పిటిషన్ వేయడం అనేది మాత్రం ఆశావహమైన పరిణామంగా కనిపించడం లేదు.

అయోధ్య సమస్య అనేది.. చాలా కాలంగా రావణకాష్టంలా రగులుతున్న భూవివాదం. ఇన్నాళ్లకు ఒక తీర్పు వచ్చింది. అది దాదాపుగా అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు. దానిపట్ల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చు గానీ.. కానీ దాన్ని సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ వేయడం అనేది మాత్రం.. ప్రజలకు నచ్చడం లేదు.

ముస్లింలలోనే పలువురు ఇలాంటి ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం పర్సనల్ లాబోర్డు మాత్రమే రివ్యూపిటిషన్ నిర్ణయం తీసుకుంటున్నది. అదే సమయంలో.. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాత్రం రివ్యూ పిటిషన్ ను వ్యతిరేకిస్తున్నారు.

రివ్యూ పిటిషన్ ద్వారా ఎలాంటి భిన్నమైన తీర్పును ఆశిస్తున్నారో మాత్రం తెలియడం లేదు. తాము ఆశించే తీర్పు, తమకు అనుకూలమైన తీర్పు వచ్చే దాకా ప్రతి వర్గమూ రివ్యూ పిటిషన్ వేస్తూ పోతే గనుక.. ఈ అయోధ్య భూవివాదం రావణ కాష్టంలాగానే మిగిలిపోతుంది.

పరస్పర అనుమానాలు, భయాలు కూడా రాచవ్రణంలా మరింత ముదురుతూ ఉంటాయి. పెద్దలు విజ్ఞతతో ఆలోచించి తమ నిర్ణయాలను సమీక్షించుకుంటే బాగుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?