మహర్షి సినిమా విడుదలకు అంతా సిద్దం అయింది. నైజాంలో ఇరవై రూపాయల రేంజ్ లో టికెట్ పెంచారు. అది పెద్ద సమస్యకాదు. ఆంధ్రలో పెద్ద హీరోల సినిమాలు ఏవి వచ్చినా, రేటు భారీగా పెంచేయడం కామన్ ప్రాక్టీస్. ఈస్ట్ గోదావరిలో ఇప్పటికే 200, 250 కూడా చేసారు. ఇంకా చాలా జిల్లాల్లో ఇదే జరుగుతోంది. చిన్న ఏరియా నెల్లూరులో కూడా పెంచారు.
కానీ విశాఖలోనే సమస్య వస్తోంది. అక్కడ థియేటర్ల జనాలు టికెట్ రేట్లు పెంచడానికి ససేమిరా అంటున్నారు. దిల్ రాజుకు ఉత్తరాంధ్రలో 30 వరకు థియేటర్లు వున్నాయి. వాటితో పెద్దగా సమస్యలేదు. అలా కాకుండా మిగిలినవారు మాత్రం రేట్లు పెంచం అంటున్నారు.
రేట్లు పెంచి బయ్యర్లు డబ్బులు చేసుకుంటున్నారని, తమకు మాత్రం మామూలు రెంట్ లే ఇస్తున్నారని, ఎప్పుడు అయితే రేట్లు పెంచారో, అవి మల్టీఫ్లెక్స్ లతో ఈక్వెల్ గా వుంటున్నాయని, దాంతో జనం అటు పోతున్నారని, అలాగే రేట్లు పెంచడం వల్ల ఆడియన్స్ తగ్గుతున్నారని, ఇవన్నీ తమకు నష్టాలని వారి వాదన. అంతేకాకుండా రేట్లు పెంచడం మీద ఇప్పటికే అనేక కేసులు వున్నాయి. థియేటర్లకు నోటీసులు వున్నాయి. రేపు ఎప్పుడైనా ఇవి చుట్టుకునేది థియేటర్ ఓనర్లకే కానీ బయ్యర్లకు కాదు.
అయితే భారీ రేట్లకు కొన్న తరవాత టికెట్ రేటు పెంచకపోతే గిట్టుబాటు కాదని, అందుకే పెద్ద సినిమాలకు అన్నింటికి టికెట్ ధరలు పెంచడం కామన్ ప్రాక్టీస్ అని బయ్యర్ల వాదన. మిగిలిన ఏరియాల్లో కన్నా వైజాగ్ లో థియేటర్ల ఓనర్లు కాస్త గట్టిగా, కట్టుగా వున్నారు. దాంతో ఇప్పటివరకు మహర్షికి ఎక్కువగా థియేటర్లు ప్రకటించలేదు.
ఇవ్వాళ, లేదా రేపు ఈ విషయం ఓ కొలిక్కి వస్తుంది. దిల్ రాజు ఇక్కడ వ్యవహారాలు ఫినిష్ చేసుకుని, ఆపై ఈ విషయంపై దృష్టి పెడతారు. ఆయనే వైజాగ్ బయ్యర్ కనుక ఏదో విధంగా ఎగ్జిబిటర్లతో ఒప్పందం చేసుకుంటారని, అప్పడు దాదాపు 90శాతం స్క్రీన్లు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. పెద్ద సినిమాను మరీ మొండిగా ఎగ్జిబిటర్లు కూడా వదులుకోరు. అయితే పేంచిన రేట్లకు అనుగుణంగా అద్దెలు పెంచితే దారికి వచ్చే అవకాశం వుంది.