మే 23 తరవాత చాలా మార్పులు?

మే 23.. తెలుగు ప్రజలు ఎక్కువ ఆసక్తితో, కొంచెం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న డేట్. ఆంధ్రనాట ఎన్నికల ఫలితాలు తెలిసే డేట్. తెలుగుదేశమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నా? ఏది గెలుస్తుంది అన్నదే ఈ ఆసక్తికి, ఉత్కంఠకు…

మే 23.. తెలుగు ప్రజలు ఎక్కువ ఆసక్తితో, కొంచెం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న డేట్. ఆంధ్రనాట ఎన్నికల ఫలితాలు తెలిసే డేట్. తెలుగుదేశమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నా? ఏది గెలుస్తుంది అన్నదే ఈ ఆసక్తికి, ఉత్కంఠకు కారణం. ఈ సంగతి అలావుంచితే, రాబోయే ఫలితాలు చాలా విషయాల మీద, చాలామంది మీద ప్రభావం చూపిస్తాయని వదంతులు వినిపిస్తున్నాయి.

గడచిన దాదాపు పదేళ్లుగా వైఎస్ జగన్ ను ఎందరో టార్గెట్ చేసారు. ఓ లెక్కలో అతన్ని తొక్కేయాలని చూసారు. అదే సమయంలో గత అయిదేళ్లలో తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని చాలామంది చాలా ప్రయోజనాలు పొందారు. ఈ ప్రయోజనాల కారణంగా వైఎస్ జగన్ ను నేరుగా ఢీకొన్న వారు, విమర్శించిన వారు, అడ్డగోలు ఆరోపణలు చేసినవారు, తమ తమస్థాయిలో జగన్ రాకుండా చేయాలని ప్రయత్నించిన వారు వున్నారు.

ఇప్పుడు వీరే ఎక్కువ ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు వైకాపాకు అనుకూలంగా వస్తే, చాలా రంగాల్లో చాలామార్పులు చోటు చేసుకుంటాయని వినిపిస్తోంది. ముఖ్యంగా మీడియా, పోలీసు రంగాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని టాక్ వినిపిస్తోంది. ఒక లీడింగ్ న్యూస్ ఛానెల్ లో ప్రారంభం నుంచి వుండి, జగన్ కు బద్ద వ్యతిరేకిగా ముద్రపడిన వ్యక్తి, ఇక ఆ ఛానెల్ ను వదిలేస్తారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఆయనపై మేనేజ్ మెంట్ వత్తిడి వుందని, ఆయన కూడా దిగిపోవడానికే డిసైడ్ అయి వున్నారని, కేవలం 23 ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఏమైనా అనుకూలంగా వస్తాయేమో అన్న ఆశతో వున్నారని వినిపిస్తోంది. లీడింగ్ న్యూస్ చానెల్ పక్క స్థానంలో వున్న ఛానెల్ విషయంలో కూడా కొన్నిమార్పులు చోటు చేసుకుంటాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ చానెల్ విషయంలో మేనేజ్ మెంట్ భాగస్వాములు మల్లగుల్లాలు పడుతున్నట్లు బోగట్టా.

ఇక కొన్ని అరకొర చానెళ్లు అయితే వైకాపా వస్తే ఇక దుకాణాలు కట్టేయాలనే ఆలోచనలో వున్నట్లు కూడా తెలుస్తోంది. ఓ ఛోటా చానెల్ ను అయితే పది నుంచి 15 కోట్ల మధ్య రేటుకు అమ్మకానికి కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

జగన్ ను నేరుగా ఢీకొని, తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న ఓ నటుడు, 23న ఫలితాలు వైకాపాకు అనుకూలంగా వస్తే, అమెరికా వెళ్లిపోయి సెటిల్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తేదేపా వస్తే అమరావతి, వైకాపా వస్తే అమెరికా అని ఆయన తన సన్నిహితుల దగ్గరే చెబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదే విధంగా సమైక్య స్ఫూర్తిని అడ్డంపెట్టుకుని, ఆ ముసుగులో చంద్రబాబు కోసం కిందామీదా అయిపోయిన ఒకరు కూడా కింకర్తవ్యమ్ అని అనుకుంటున్నారట. ఇక అన్నింటికి మించి అమెరికా నుంచి వచ్చి, ఇక్కడ ఏదో పేరుచెప్పి, అలాట్ మెంట్లు తీసుకుని, ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందిన వారంతా ఏం జరుగుతుంది? అని సంశయస్థితిలో వున్నారని టాక్.

పోలీసుశాఖలో కిందిస్థాయిలో ఏమీ మార్పులు వుండవని, ప్రభుత్వం వత్తిడుల ఫలితంగా జగన్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసిన కొంత మందికి మాత్రం ఇబ్బంది వుంటుందని వినిపిస్తోంది. మొత్తంమీద తేదేపా మళ్లీ వస్తే ఏమోకానీ, వైకాపా వస్తే మాత్రం చాలామార్పులు వస్తాయని టాక్ వినిపిస్తోంది. 

వైయస్‌ను నెత్తిన పెట్టుకునేలా చేసిన పథకాలను బాబు కాలరాసారు