ఫామ్ లో వున్న ఓ హీరో సినిమా తీస్తున్నాడు అంటే, తలో చేయి వేసి సాయం చేయడానికి రెడీగా వుంటారు చాలా మంది.
విజయ్ దేవరకొండ తండ్రి తన సరదా కొద్దీ సినిమా నిర్మాణం ప్రారంభించారు. అయితే విజయ్ లుక్ లో మంచిగా వుండాలని చాలా మంది సాయం చేసి, అతనికి బాగా లాభాలు వచ్చేలా చూసినట్లు బోగట్టా.
సినిమా నిర్మాణ వ్యవహారాలు అన్నీ నిర్మాత మధుర శ్రీధర్ సాయం పట్టినట్లు తెలుస్తోంది. ఆయన పెళ్లి చూపులు సినిమా దగ్గర నుంచి విజయ్ కు దగ్గరయ్యారు. ఆయనే నిర్మాణ వ్యవహారాలు దగ్గర వుండి పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. వీలయినంత తక్కువగా సినిమాను ఎలా తీయవచ్చో అన్నట్లు తీసి పెట్టించినట్లు తెలుస్తోంది.
విజయ్ తో సినిమా చేయాలని చాలా కోరికగా వున్న ఏషియన్ సునీల్ కొరి కోరి రెండున్నర కోట్లకు సినిమాను కొన్నట్లు బోగట్టా. నిజానికి సినిమాలు కొనడంలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తారని ఆయనకు పేరు. పైగా చిన్న సినిమాలు అస్సలు కొనరు. అడ్వాన్స్ లే ఇస్తారు. కానీ అలాంటిది రెండున్నర కోట్లకు కొనడం అంటే విజయ్ గుడ్ లుక్స్ లో వుండడం కోసమే అని తెలుస్తోంది.
ఇక విజయ్ తో బంధాలు వున్న మైత్రీ మూవీస్ సంస్థ పూనుకుని, విడుదలకు ముందే శాటిలైట్ అమ్మకాలు చేయించినట్లు తెలుస్తోంది. తమకు వున్న పలుకుబడి, పరచయాలు వాడుకుని, మంచి రేటుకు శాటిలైట్ అయ్యేలా ఆ సంస్థ అధినేతలు కృషి చేసారని టాక్
ఇలా మొత్తం మీద విజయ్ కోసం అందరూ తలా చేయి వేసి, అతనికి మూడు కోట్ల మేరకు లాభం వచ్చేలా చేసారు. కానీ బయ్యర్లు మాత్రం నష్టపోయారంతే.