‘‘జుట్టు పట్టుకుని బయటికీడ్చినా చూరు పట్టుకుని ఉండేవాడికి భలే ఛాన్సులే..’’ అంటూ రమణారెడ్డి… ఇల్లరికంలో ఉన్న మజా గురించి.. తనదైన శైలిలో సినిమా పాటలో రక్తకట్టించారు.
అవతలి వారు ఎంతగా ఛీకొడుతున్నప్పటికీ.. వారితో తన ప్రేమానుబంధాల గురించి.. బాహ్య ప్రపంచానికి పదేపదే చాటుకోవాలని ముచ్చటపడే వారి గురించి ఏం చెప్పాలి? బహుశా ఆ పాట రాసిన రచయితకు కూడా ఐడియా వచ్చి ఉండకపోవచ్చు. భాజపాతో పవన్ కల్యాణ్ సంబంధాన్ని గమనిస్తే… ఇదే పాట గుర్తుకు వస్తుంది.
పవన్ కల్యాణ్.. ఇసుక సమస్యకు వ్యతిరేకంగా విశాఖలో నడవదలచుకున్నారు. దానికి తగినంత మంది జనం వస్తారో లేదోనని ఆయనకు భయం! రాకపోతే పరువు పోతుందని భయం. అందుకే చివరి సమయంలో తెలుగుదేశం, భాజపాల స్నేహహస్తం అభ్యర్థించారు.
పవన్ తో దోస్తీ కంటె తమ బతుకులకు మరో పరమార్థం లేదని భావించే తెలుగుదేశం మాత్రం ఎగబడి ఆయనకు మద్దతిచ్చింది. తెదేపా మాజీమంత్రులు పవన్ సభలోనూ పాల్గొన్నారు.
అయితే రాష్ట్రంలో ద్వితీయ స్థాయి పార్టీగా ఎదగాలని అనుకుంటున్న భాజపా మాత్రం పవన్ విజ్ఞాపనను పట్టించుకోలేదు. దారుణంగా తిరస్కరించింది. ఆయనతో కలిసి వేదిక పంచుకోం అంటూ ఛీకొట్టింది. కార్యక్రమానికి హాజరు కాకపోగా, ఇసుకపై తమ సొంత పోరాటాలు ప్లాన్ చేసుకుంటోంది.
పవన్ మాత్రం.. విశాఖ సభలో తనకు మోడీ చాలా క్లోజ్ అనే బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
‘నన్ను ఎంతో ప్రేమగా పిలిచే ప్రధాని మోడీ’ అంటూ మోడీ తనకు చాలా క్లోజ్ అని చెప్పుకోడానికి పవన్ ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికలకు ముందు మోడీ ఎంత ప్రేమగా అయినా పిలుస్తూ ఉండిఉండవచ్చు గాక… పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజాబలంపై అప్పట్లో కొందరికి కొన్ని భ్రమలు ఉండేవి కాదు. అందుకు మోడీ కూడా అతీతుడు కాదు.
కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. పోటీచేసిన రెండు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లోనూ గెలవలేకపోయిన… ప్రజలు తిరస్కరించిన నాయకుడిపై మోడీ ఎంత ప్రేమ చూపిస్తారో? ఒకసారి పవన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర సమస్యలు చెప్పడానికి మోడీని కలిస్తే అప్పుడు తెలుస్తుంది.