cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

విశాఖ ఇసుక స్ట్రాటజీ వెనుక..

విశాఖ ఇసుక స్ట్రాటజీ వెనుక..

మొత్తానికి విశాఖ తీరంలో ఇసుక తుపాను ముగిసింది. పవన్ కళ్యాణ్ జంపింగ్ ల ప్రసంగం వినేసారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం జంపింగ్ ల ప్రసంగం అని అనడం ఎందుకంటే, ఆయన ప్రసంగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి, దేనికి అది వింటే బాగానే వుంటుంది. అలా కాకుండా ఆసాంతం వినాలనుకుంటే, ఇక్కడికి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జంప్ లు చేసినట్లు వుంటుంది. సరే, అదంతా వేరే సంగతి.

ఇంతకీ విశాఖలో ఈ మార్చ్ సంగతేమిటి? దానికి విశాఖనే ఎందుకు వేదిక చేయాలి? ఇసుక ఎక్కువగా రవాణా అయ్యే శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలను ఎందుకు వదిలేసారు? రాజమండ్రి చుట్టు పక్కల గత అయిదారేళ్ల కాలంగా పోస్టర్లు వేసి మరీ ర్యాంప్ లు నడిపారు. ఆ సంగతి మరిచారా? కొందరు ప్రజా ప్రతినిధులు వందలాది కోట్లు సంపాదించారు. అది మరిచారా? 

మరి అలాంటి సెంటర్ ను వదిలేసి, విశాఖనే ఎందుకు వేదికగా చేసుకున్నారు?

దీని వెనుక చాలా వ్యవహారం వుంది. విశాఖ అన్నది విజయవాడ తరువాత ఓ సామాజిక వర్గం తన అడ్డాగా చేసుకుంది. ఇది దాదాపు ఇరవై ఏళ్లుగా జరుగుతోంది. విశాఖలో వైకాపా సరైన ఫలితాలు సాధించకపోవడానికి కూడా ఈ వర్గం తాలూకాబలమే కారణం.ఇలాంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గాన్ని గట్టిగా నొక్కే ప్రయత్నం జరుగుతోంది. విశాఖలో మేయర్ ఎన్నికలు రాబోతున్నాయి.

విశాఖ మీద తమ పట్టుపోతుందేమో అన్న భయం ఈ వర్గంలో ఎంతో కొంత వుంది. ఇలాంటి టైమ్ లో స్థానికుల సాయం కన్నా, ఈస్ట్, వెస్ట్ నుంచి ఇక్కడ ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పెద్ద సంఖ్యలో వచ్చిన వారి మద్దతు తీసుకోవడం అవసరం. అలాంటి మద్దతు రావాలి అంటే పవన్ కావాలి. 

ఒకవేళ విశాఖమేయర్ కనుక తెలుగుదేశం చేజారిపోతే, ఆ పార్టీ మద్దతులో విశాఖను గుప్పిట్లో పెట్టుకున్న వర్గం చాలా ఇబ్బంది పడుతుంది.

విశాఖలో రియల్ ఎస్టేట్, హోటల్, ఇండస్ట్రీ తదితర రంగాల్లో ఆ వర్గం బలంగా వుంది. విజయసాయి రెడ్డి విశాఖను ఎలాగైనా వైకాపా కు అనుకూలంగా మార్చాలని పట్టుదలగా వున్నారు. అందువల్ల ఆ ఆటలు సాగకుండా, తమ బలం తమకు వుండేలా చేయాలన్నది ఆ వర్గం ప్లాన్. ఒక వేళ మేయర్ ఎన్నికలు వచ్చినా తట్టుకునేలా వుండాలి వ్యవహారం.

పైగా విశాఖలో తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు వున్నారు. సబర్బన్ ఏరియాల్లో జనాలు వున్నారు. వీళ్లందరినీ వాడుకునే అవకాశం వుంది. ఆ విధంగా వైకాపా కు రాబోయే మేయర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే చెక్ చెప్పడానికి అవకాశం వుంది. అదీ కాక ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఫండింగ్ కావాలి. విశాఖలో అయితే ఆ సామాజిక వర్గం అండ వుంటుంది. వాళ్లకు ఈ కార్యక్రమం వల్ల కాస్తో కూస్తో ప్రయోజనం వుంటుంది.

విశాఖలో గంటా తో సహా పలువురు పార్టీ గోడ దూకుతారనే ప్రచారం వుంది. అలాంటి వాళ్లకు చెక్ చెప్పాలంటే ఏదో జరుగుతోంది. పార్టీ ఏదో చేస్తోంది అన్న ఆలోచన రావాల్సి వుంది. అందుకే తెలుగుదేశం పార్టీ తెరవెనుక మాంచి ప్లానింగ్ చేసింది అనే చెప్పాలి. ఇంతటి తెలివితేటలు పవన్ పార్టీకి వున్నాయంటే కాస్త అనుమానమే.

నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ వచ్చారు జనసేన నుంచి. కానీ తెలుగుదేశం నుంచి మాత్రం వెలమ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న, అచ్చెన్న వచ్చారు తప్ప, కాపు నాయకులు రాలేదు. చిత్రంగా లోకల్ గా వున్న గంటా, వెలగపూడి కూడా రాలేదు. కారణం వీళ్ల కారణాలు వీళ్లకు వున్నాయి. ఎన్నికల ఫలితాల మర్నాడు వెలగపూడి తన చిత్తానికి మాట్లాడారు.

ఆ తరువాత ఆయన ఎక్కడ వున్నారో? అస్సలు కనిపించలేదు. అస్సలు ఒక మాట కూడా వినిపించలేదు. ఇక గంటా సంగతి చెప్పనక్కరలేదు. ఆయన వ్యాపారాలు, వ్యవహారాలు ఆయనకు వున్నాయి. ఆ ముందు జాగ్రత్తలు అవసరం.  అందుకే వారంతా తెరవెనుకే వుండిపోయారు. విశాఖ సిటీ తో సంబంధం లేని నేతలు తెరపైకి వచ్చారు.

ఎక్కువ మంది జనాలు కనిపించేలా, జనాలు మరీ స్ప్రెడ్ అయిపోకుండా వుండేలా స్వల్ప దూరాన్నే కార్యక్రమానికి ఎంచుకున్నారు. అంతా పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగింది. అంతా బాగానే వుంది.

కానీ, పవన్  చరిష్మాను పెంచి తెలుగుదేశం పార్టీ తెరవెనుక వుండి బావుకునేది ఏముంది? అంటే తెలుగుదేశం పార్టీకి దూరమై నష్టపోయామన్న జ్ఞానోదయం పవన్ కు కలిగి వుండాలి. అలా కలిగి, ఇక తమతోనే వుంటారనే నమ్మకం తెలుగుదేశం పార్టీకి వచ్చి వుండాలి.

అదే విధంగా మేయర్ ఎన్నికల ద్వారా అయినా కాస్త బలోపేతం కావాలంటే తాత్కాలికంగానైనా తెలుగుదేశం అండ అవసరం అన్న ఆలోచనకు వచ్చి వుండాలి. లేదా పవన్ కు ఈ ఆశ కలిగించి, విశాఖ మీద తమ పట్టు పోకూడదనే ఆలోచనలో తెలుగుదేశం, దాని మద్దతు సామాజిక వర్గం వుండి వుండాలి.

మొత్తం అన్నీ కలిసి విశాఖ మీద ఇసుక తుపానుకు జనసేనను ప్రేరేపించి వుంటాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఇసుక సమస్య ఇక ఎన్నాళ్లో వుండదు. వర్షాలు ఎప్పుడయితే తగ్గుముఖం పట్టాయో, ఇక విరివిగా ఇసుక మార్కెట్ లోకి వస్తుంది. అందుకే తెలివిగా పవన్ కూడా రెండువారాల గడువు అన్న మాట వాడారు. రెండు వారాల్లో పరిష్కారం అయిపోతే తన ఘనత అని చెప్పుకోవచ్చు అని.

అయితే ఎప్పుడు అయినా ఎన్నికల్లో గెలుపు ఓటమలు  జనాల్లో అసంతృప్తిని ఏ మేరకు రగల్చగలిగారు అన్న దాని మీదే ఆధార పడి వుంటుంది. ఏ మేరకు రగులుకుంటుంది అన్నదాన్ని బట్టే పవన్ కష్టానికి, తెలుగుదేశం మద్దతుకు ఫలితం వుంటుంది. ఆ అవకాశం అయితే సుదూర తీరంలో కనిపించడం లేదు.