సినిమా అభిమానం పరాకాష్టకు చేరింది. ఆన్ లైన్ వేదికగా సినిమా అభిమానులు అసహ్యకరమైన ప్రచారాలకు పాల్పడుతున్నారు. విక్రమ్ “ఐ'' సినిమాపై దుష్ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా బాగోలేదంటూ ఆన్ లైన్ లో కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ట్విటర్ అకౌంట్ ల ద్వారా విక్రమ్ ఐ సినిమా బాగోలేదని చెబుతున్నారు. “విక్రమ్ కష్టం బూడిదలో పోసిన పన్నీరు..'' అయ్యింది.. అంటూ వీరు ట్వీట్లు పెడుతున్నారు!
మరి ఏపీలో ఎక్కడా “ఐ'' సినిమా ప్రివ్యూలు ఏర్పాటు చేయలేదు. తమిళ వెర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు.. కానీ తెలుగు వెర్షన్ కు మాత్రం అలాంటి ఏర్పాట్లేమీ లేవు. మరి సినిమా తెలుగులో ప్రదర్శితం కాక మునుపే.. ఇలాంటి ట్వీట్లు వచ్చాయంటే… పరిస్థితిని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. మరి ఈ డబ్బింగ్ సినిమాపై ఇలాంటి ప్రచారం చేస్తే వారికి వచ్చే లాభం ఏమిటో ఎవరికీ అర్థం కాని విషయం.
ఒకవైపు తమిళ ప్రీమియర్ షో లు చూసిన వారు మాత్రం సినిమా బాగుందని అంటున్నారు. మరి ఈ తెలుగువారి ట్వీట్లు వ్యక్తిగత అభిప్రాయాలు అనుకోవచ్చు. అయితే సినిమా తెలుగులో ఎక్కడా ప్రదర్శితం కాకమునుపే… ఆ సినిమా బాగోలేదని ఎలా తేల్చేస్తారు? విడుదల కాకమునుపే రివ్యూ రాయడంఏమిటి? ఏ సినిమానైనా విమర్శించవచ్చు. విక్రమ్ , శంకర్ లు విమర్శలకు అతీతులు కాదు.. అయితే పనిగట్టుకొని.. కొన్ని ట్విటర్ అకౌంట్లు ఇదే పనిచేస్తున్నాయంటే మాత్రం ఇందులో ఇదంతా వ్యూహాత్మకంగా జరగుతున్నదేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి ట్విటర్ అకౌంట్లకు మిగతా వారి నుంచి ఘాటైన సమాధానాలే వస్తున్నాయి. ఫేక్ రివ్యూలు పెట్టి జనాలను తప్పుదారి పట్టించవద్దని రీ ట్వీట్లు వస్తున్నాయి. విడుదల కాకమునుపే బాగోలేదని రాస్తున్న మీ దగ్గర లాజిక్ ఏముందని రీ ట్వీట్ల ద్వారా ఎదురు ప్రశ్నలు పడుతున్నాయి. ఏదేమైనా.. ఇలాంటి వాతావరణం హర్షించదగ్గది కాదు.