అల్లు అర్జున్, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాలి. విక్రమ్ కుమార్ కు అవకాశం ఇద్దామనుకునే టైమ్ లో హరీష్ శంకర్ అడ్డుపడ్డాడు. అలా విక్రమ్ ప్రాజెక్టును పక్కనపెట్టి డీజే చేశాడు. తర్వాత మరోసారి విక్రమ్ కు ఛాన్స్ ఇద్దామనుకుంటే వక్కంతం వంశీ సినిమా ఓకే అయింది.
పోనీ ఈ మూవీ తర్వాతైనా విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తాడనుకుంటే.. లింగుస్వామి ప్రాజెక్టు పెండింగ్ లో ఉండనే ఉంది. దీనికి తోడు ఇప్పుడు మారుతి, కల్యాణ్ కృష్ణ లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో బన్నీతో చేయాల్సిన ప్రాజెక్టు నుంచి విక్రమ్ కుమార్ దాదాపు తప్పుకున్నట్టు తెలుస్తోంది.
అఖిల్ తో చేస్తున్న హలో సినిమా తర్వాత బన్నీతో మూవీ చేయడం లేదు విక్రమ్ కుమార్. ఓ సరికొత్త కథతో నాని హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. హలో మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే నానితో చేయాల్సిన సినిమాపై అఫీషియల్ స్టేట్ మెంట్ వస్తుంది.
ప్రస్తుతం ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. ఆ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. కానీ హను స్థానంలో విక్రమ్ కుమార్ కు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాని-విక్రమ్ కుమార్ ప్రాజెక్టుకు మహేష్ బాబు సోదరి మంజుల నిర్మాత.