విశ్వరూపం 2 సినిమా ఎప్పటి నుంచో ముస్తాబు అవుతూనే వుంది. ఇన్నాళ్లకు ఇంక థియేటర్లలోకి వదిలేయాలని డిసైడ్ అయ్యారు. తెలుగునాట సరైన ప్రచారమూ లేదు, బజ్ కూడా లేదు. పైగా ఆ సినిమాకు ఒక పక్క శ్రీనివాస కళ్యాణం, మరోపక్క గీత గోవిందం వస్తున్నాయి. ఇక అలాంటపుడు ఏదో అద్భుతం జరిగితే తప్ప, ఆ సినిమాకు పైసలు రావడం కష్టం.
పైగా తెలుగు హక్కులు తీసుకున్న ఎన్వీ ప్రసాద్ కూడా ఏదో విడుదల చేస్తే చాలు అన్నట్లు వుంది వ్యవహారం చూస్తుంటే. ఇలాంటి టైమ్ లో ఆ సినిమా మళ్లీ వాయిదా పడుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాట అనుకోని విషాదం నెలకొనడమే అందుకు కారణం.
అక్కడి ప్రజల్లో చాలామంది అభిమానించే నాయకుడు, 94 ఏళ్ల వృద్దుడు, సీనియర్ రాజకీయ నాయకుడు కరుణానిధి నిన్న మరణించారు. ఈరోజు అంత్యక్రియలు జరుగుతాయి. ఏడురోజులు సంతాప దినాలు ప్రకటించారు.
మరి కమల్ ఏ నిర్ణయం తీసుకుంటారో? ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా. కానీ కమల్ విడుదలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పైగా జయలలిత మరణిస్తే ఏ సినిమా వాయిదా పడలేదు. అందువల్ల ఇప్పుడు కూడా వాయిదాపడే అవకాశం వుండదని వినిపిస్తోంది.