బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ను ఆర్భాటంగా లాంఛ్ చేశాడు తేజ. కానీ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అంతకంటే ముందు వెంకీతో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఇలా షార్ట్ గ్యాప్ లో 2సినిమాలు మిస్ చేసుకున్న తేజ ఇప్పుడేం చేస్తున్నాడు? తన నెక్ట్స్ సినిమా ఎవరితో తీయబోతున్నాడు..?
ఎప్పట్లానే తేజ కెరీర్ లో మళ్లీ గ్యాప్ వచ్చేసింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా సక్సెస్ ను అతడు క్యాష్ చేసుకోలేకపోయాడు. ప్రస్తుతం తేజ దగ్గర 3ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఏది వర్కవుట్ అవుతుందో అతడు కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి.
నిర్మాత డీవీవీ దానయ్య, తన కొడుకును హీరోగా పరిచయం చేసే బాధ్యతను తేజకు అప్పగించినట్టు తెలుస్తోంది. గతంలో నితిన్, నవదీప్, ఉదయ్ కిరణ్ లాంటి హీరోల్ని వెండితెరకు పరిచయం చేసిన తేజ, ఇప్పుడు దానయ్య కొడుకును హీరోని చేసే పనిలో ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు నానితో కూడా ఓ సినిమా చేసే ప్లాన్స్ లో తేజ ఉన్నట్టు టాక్. ఈ మేరకు నల్లమలపు బుజ్జి రిఫరెన్స్ తో నానిని కలిసి స్టోరీ వినిపించాడట తేజ. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్టు సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇవన్నీ పక్కనపెడితే.. రానాతోనే మరో సినిమా వర్కవుట్ అయ్యేలా ఉందని స్వయంగా తేజ ప్రకటించాడు. సో.. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ 3 ప్రాజెక్టుల్లో ఏదో ఒకటి ఫైనల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.