సాహోకు అంత సీన్ ఉందంటావా ప్రభాస్?

కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడనేది వైరల్ అయింది. ఉప్పెనగా మారి బాహుబలి-2కు అఖండ విజయం తీసుకొచ్చింది. ఇక దంగల్ విషయానికొస్తే చైనాలో ఇది కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. అమీర్ నటించిన పీకే…

కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడనేది వైరల్ అయింది. ఉప్పెనగా మారి బాహుబలి-2కు అఖండ విజయం తీసుకొచ్చింది. ఇక దంగల్ విషయానికొస్తే చైనాలో ఇది కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. అమీర్ నటించిన పీకే సినిమా భాషతో సంబంధం లేకుండా ఇండియా అంతటా హిట్ అయింది. ఇలా ప్రతి సినిమా విజయం వెనక ఓ కీలకమైన అంశం ఏదోఒకటి పనిచేసింది. మరి సాహోకు అలాంటి అంశం ఏమైనా కలిసొస్తుందా?

అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవాలంటే సాహోకు ఇలాంటి ఏదో ఒక అంశం కలిసిరావాలి. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్లు వరంగా టాప్-5 లిస్ట్ లోకి చేరాలంటే ఇలాంటి ప్రత్యేకమైన అంశం యాడ్ అవ్వాల్సిందే. దురదృష్టం ఏంటంటే, సాహోకు అలాంటి ఎలిమెంట్ దరిదాపుల్లో కనిపించడం లేదు. కేవలం ప్రభాస్ స్టార్ డమ్ ఒక్కటే ఈ సినిమా చుట్టూ కనిపిస్తోంది.

బాహుబలి-2 సినిమాకు అత్యథిక వసూళ్లు రావడానికి ప్రధాన కారణాలు రెండు. ఓవర్సీస్ లో ఈ సినిమా అద్భుతమైన విజయాన్నందుకుంది. ఇక డొమస్టిక్ గా చూసుకుంటే ఉత్తరాదిన ఈ సినిమా కళ్లుచెదిరే వసూళ్లు సాధించింది. అప్పటివరకు ఏ బాలీవుడ్ హీరోకు సాధ్యంకాని రీతిలో కలెక్షన్లు (రూ.511 కోట్లు) వచ్చాయి. సాహో సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటేనే అత్యథిక వసూళ్లు సాధ్యం.

ఓవర్సీస్ లో అయితే పరిస్థితి మెరుగ్గానే ఉంది. బాహుబలి-2కు ఏమాత్రం తగ్గని విధంగా 600కు పైగా లొకేషన్లలో భారీఎత్తున సాహోను దించుతున్నారు. పైగా బాహుబలి-2 టైమ్ తో పోలిస్తే టిక్కెట్ రేటు కూడా 5 డాలర్లు పెరిగింది. సో.. ఓవర్సీస్ లో సాహో ఓపెనింగ్స్ కు ఢోకా లేదు. ఎటొచ్చి సినిమా హిట్ అవ్వాలంతే. సక్సెస్ అయితే ఆటోమేటిగ్గా కలెక్షన్లు వస్తాయి.

నార్త్ లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. బాహుబలి-2 రేంజ్ లో ఉత్తరాదిన సాహోకు థియేటర్లు దొరకలేదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే క్యూరియాసిటీతో పాటు, థియేటర్ల విషయంలో కరణ్ జోహార్ చేసిన లాబీయింగ్ అప్పట్లో బాగా పనిచేసింది. ఆ మేజిక్ సాహో విషయంలో రిపీట్ అవ్వలేదు. ఉత్తరాదిన సాహోకు భారీగానే థియేటర్లు దొరికాయి కానీ ఆశించిన స్థాయిలో మాత్రం దక్కలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లో మాత్రమే సాహోకు ఎక్కువ థియేటర్లు లభించాయి.

ప్రపంచవ్యాప్తంగా 2122 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి నంబర్ వన్ ఇండియన్ మూవీగా నిలిచింది దంగల్. ఆ తర్వాత స్థానంలో 1788 కోట్ల రూపాయలతో బాహుబలి-2 రెండో స్థానంలో నిలిచింది. ఇక పీకే సినిమాకు 792 కోట్లు.. రజనీ నటించిన 2.Oకు 723 కోట్లు.. బాహుబలికి 650 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడున్న అనుకూల పరిస్థితుల మధ్య సినిమా హిట్ అయితే.. బాహుబలి, 2.O లాంటి సినిమాల్ని క్రాస్ చేయడం సాహోకు పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. ఎటొచ్చి దంగల్, బాహుబలి-2 రేంజ్ కు వెళ్లాలంటే మాత్రం డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాల్సిందే. ఇంతకుముందు చెప్పినట్టు ఏదో ఒక ప్రత్యేకమైన అంశం కలిసిరావాల్సిందే.

ప్రభాస్ కూడా బాహుబలి-2తో సాహోను కంపేర్ చేయడంలేదు. తన స్నేహితులైన నిర్మాతలు ఎక్కువ డబ్బులు పెట్టారు కాబట్టి, ఆ డబ్బుకు తగ్గ రేంజ్ లో ప్రతిఫలం వస్తే చాలని మాత్రమే ఆశిస్తున్నాడు. రెవెన్యూ పరంగా చాలా తక్కువ అంచనాలతోనే థియేటర్లలోకి వస్తున్నామని, ఎవ్వరూ నష్టపోకుండా గట్టెక్కితే అదే పదివేలు అంటున్నాడు. 

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!