అమరాతిలో తెలుగుదేశానికి చెందిన వారిలో ఎవరెవరికి బినామీ ఆస్తులు ఉన్నాయో బయటపెడతాం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మొత్తం గుట్టు బయటకు తీయడానికి చాలా సమయం పడుతుందని అన్న బొత్స, శాంపిల్ గా కొన్ని సంగతులు వదిలారు. అందులో సుజనా ఆస్తులు కొన్ని ప్రస్తావించారు. అలాగే బాలకృష్ణ వియ్యంకుడికి 493 ఎకరాలు కేటాయించారని, ఆ తర్వాత దానిని సీఆర్డీయే పరిధిలోకి తీసుకువచ్చారని మరో బాంబు పేల్చారు. అందుకే వారు రాజధాని తరలింపు వ్యవహారం గురించి యాగీ చేస్తున్నారని అన్నారు.
ఇప్పుడు ఆ ఆరోపణలకు కౌంటర్ వచ్చింది. బాలకృష్ణ వియ్యంకుడి మీద బొత్స ఆరోపణలు చేయగా, స్వయంగా బాలయ్య అల్లుడే మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పారు. బొత్స ఆరోపణలు ఏ రకంగా అర్థరహితమైనవో వివరించే ప్రయత్నం చేశారు. నల్లారి కిరణ్ సీఎంగా ఉండగా, బొత్స మంత్రిగా ఉండగానే తమకు ఆ భూములు కేటాయించారని.. గీతం విద్యాసంస్థల ఛైర్మన్ ఎ.భరత్ అంటున్నారు.
విజయవాడ, అమరావతికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ భూములను న్యాయపరమైన చిక్కుల వల్ల ఇప్పటిదాకా తమకు అప్పగించలేదని కూడా అంటున్నారు. దీన్ని తెదేపాకు అంటగట్టడం కరెక్టు కాదనేది ఆయన వాదన. తన పెళ్లికి ఆరేళ్ల ముందే ఆ ప్రాజెక్టు తలపెట్టామని, కాంగ్రెస్, కిరణ్ ప్రభుత్వంలోనే ఎంఓయూపై సంతకాలు చేశామని భరత్ చెబుతున్నారు.
ఇప్పుడు వివాదం పాకాన పడినట్లు లెక్క. భూములు ఎవరు, ఎప్పుడు కేటాయించారు… ఎప్పుడు సీఆర్డీయే పరిధిలోకి మార్చారు.. అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి..? అనేవి ఇక్కడ కీలకాంశాలు. ఈ విషయంలో తొలుత ఆరోపణలు రువ్విన బొత్స ఇప్పుడు స్పందించాల్సి ఉంది. తను చెప్పింది నిజమని నిరూపించుకోవాలి.
అదేసమయంలో.. భరత్ కూడా తను చెప్పిన వాదనకు అనుకూలంగా ఉన్న డాక్యుమెంట్లను మీడియా ముందుపెడితే.. బొత్స వాదన తప్పని తేలుతుంది. ఇరుపక్షాలూ మాటలతో ఊరుకోకుండా.. అలాచేస్తే గనుక.. బొత్స పరువు మంటగలుస్తుంది.