రాజధాని అమరావతిలో బినామీలతో భూములు కొనుగోళ్లు చేసిన టీడీపీ బ్యాచ్ లిస్ట్ త్వరలో బైటపెడతామని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్న వేళ.. గురుశిష్యులు నారాయణ, లోకేష్ ఆందోళనకు గురవుతున్నారు. రాజధాని పరిసరాల్లో బినామీల పేరుతో అత్యథికంగా భూములు కొనుగోలు చేసింది వీరిద్దరే అనే ఆరోపణలున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీరిపై ఆరోపణలు వచ్చాయి.
అప్పట్లో భూముల వాటాల విషయంలో నారాయణ కుటుంబంలో కలహాలు రావడంతో ఈ వ్యవహారం బైటపడింది. భార్య సహా మరి కొంతమంది మహిళలు బినామీలుగా మంత్రి నారాయణ రాజధాని చుట్టూర రియల్ ఎస్టేట్ దందా నడిపారు. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ.. చినబాబు తరపున బినామీలకు భూములు కట్టబెట్టారు నారాయణ. అందుకే ఆయన సీఆర్డీఏకి అధిపతిగా పెత్తనం చలాయించారు. అదే సమయంలో మంత్రిపదవి కూడా దక్కించుకుని తన హవా చూపించారు.
గతంలో లావాదేవీలు ఉన్నా కూడా.. కేవలం రాజధాని భూముల వ్యవహారం వల్లే చంద్రబాబు కుటుంబానికి నారాయణ మరింత సన్నిహితులయ్యారు. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు అక్రమాలు తవ్వితీస్తున్నామనడంతో వీరిద్దరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నారాయణ నుంచి లోకేష్ బినామీలకు ఎక్కడెక్కడ, ఎలా స్థలాలు వెళ్లిందీ రిజిస్ట్రేషన్ల విషయంలో బైటపడితే టీడీపీ అక్రమాల్లో అదే పెద్దది అవుతుంది. రాజధాని తరలింపుపై అప్పటి సీఆర్డీఏ చైర్మన్ గా ఉన్న నారాయణ కనీసం పెదవి విప్పకపోవడానికి ఇదే కారణం.
ఎంపీ సుజనా చౌదరి మాత్రం రాజధాని విషయంలో తొందరపడి నోరుజారారు.. ఇప్పుడు మంత్రి బొత్స చిట్టా విప్పడంతో టెన్షన్ పడుతున్నారు. వైసీపీ నేతలు త్వరలో వెలికితీసే లిస్ట్ లో ముందు నారాయణ, తర్వాత లోకేష్ పేర్లు వినపడబోతున్నాయని సమాచారం. ఆ రికార్డులన్నీ బైటపడితే వీరిద్దరూ రాజధానిని అడ్డం పెట్టుకుని ఎన్ని వేల ఎకరాలు స్వాహా చేశారో అర్థమవుతుంది.