ప్రభుత్వాలు తాము చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి.. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటాయి. ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగాం ద్వారా కూడా ఈ పనిచేయిస్తూనే… పార్టీ కూడా అందుకు ఎక్కువ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వం గురించి ప్రజల్లో మంచిపేరు దక్కేలా విస్తృతంగా ప్రచారం చేయడానికి పనిచేస్తుంటుంది. ఈ క్రమంలో భాగంగానే.. మీడియా ప్రతినిధులను టూర్లకు తీసుకువెళ్లి.. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను చూపించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటుంది. వారిద్వారా తమ గురించి ప్రజల్లోకి పాజిటివ్ ప్రచారం జరుగుతుందని ఆశిస్తుంది.
కానీ… ఇప్పుడు ప్రపంచంలో ట్రెండ్ మారిపోతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సోషల్ మీడియా పోటీగా తయారవుతోంది. ఒక అంశాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా దాచిపెట్టినంత మాత్రాన అది ప్రజలకు తెలియకుండా ఉండిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. సోషల్ మీడియా బహుముఖాలుగా అంత ఘనమైన పాత్ర పోషిస్తోంది. దానికి తగ్గట్లుగానే రాజకీయ ప్రత్యర్థులు కూడా సోషల్ వేదికల మీదనుంచే ప్రభుత్వాల మీద బురద చల్లడానికి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. విచ్చలవిడిగా ప్రభుత్వ వైఫల్యాలంటూ ప్రచారాలు సృష్టిస్తున్నారు.
తాజాగా కేసీఆర్ ఈ సోషల్ దుష్ప్రచారాలకు ఒక విరుగుడు కనుగొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా చాలా విమర్శలు సోషల్ వేదికలపై వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టడానికి… ప్రచారాల్ని తిప్పికొట్టడానికి కేసీఆర్ కొత్త ప్లాన్ ఆలోచించారు. పార్టీ తరఫున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. పార్టీకి ఫేవర్ గా పనిచేసే వారినందరినీ.. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
ఇలా ఎవరైతే పోస్టులు పెడతారో.. వారినే స్వయంగా కాళేశ్వరం వద్దకు తీసుకువెళ్లి.. వారికి అక్కడేం జరుగుతోందో స్వయంగా అధికారులతోనే చెప్పించి.. సరైన అవగాహన కలిగించినట్లయితే.. ఆ అంశంపై ఎప్పుడు ఎలాంటి విమర్శలు వచ్చినా వారు సమర్థంగా తిప్పికొట్టగలరనేది.. కేసీఆర్ ఆలోచన.
నిజానికి ఈ ప్లాన్ చాలా బాగుంది. సాధారణ మీడియా వారిని తీసుకెళ్లినట్లే.. తమ పార్టీ సోషల్ మీడియా వాళ్లను కూడా పార్టీ తీసుకెళ్తుందన్నమాట. వారినుంచి అనుకూల ప్రచారాన్ని ఆశిస్తున్నారు. నిజానికి ఇది ఇతర ప్రభుత్వాలు కూడా ఫాలో కాగలిగినంత మంచి ఆలోచనగానే ఉన్నదని పలువరు వ్యాఖ్యానిస్తున్నారు.