జమ్మూకాశ్మీరు అంశంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తొలినుంచి స్థిరంగా ఒకే తీరుగా వ్యతిరేకిస్తున్న వారు వామపక్షాల వారు మాత్రమే. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎలాంటి మార్పులేకుండా దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మోడీ సర్కారుకు ఈ విషయంలో పెద్ద ఇబ్బంది లేకుండాపోతోంది. నిన్నటిదాకా కూడా పార్టీలో చాలా మంది 370 విషయంలో మోడీ సర్కారును సమర్థిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీనే ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేయడంతో.. గులాంనబీ లాంటి కొందరు అతిగా వ్యతిరేకిస్తున్న వార్లు సైలెంట్ అయిపోయే అవకాశం ఉంది.
370ని రద్దుచేసిన తొలినాటినుంచి మోడీ సర్కారు దేశవ్యాప్తంగా ప్రజాభిమానాన్ని కూడగట్టుకుంది. దేశంలో దాదాపు అన్ని పార్టీలకు చెందినవారు కూడా దీన్ని సమర్థించారు. మోడీ వ్యతిరేకులు కూడా మిన్నకున్నారు తప్ప నిందలు వేయలేదు. అయితే కాంగ్రెసు పార్టీ సహజంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ కాశ్మీరీ నాయకుడు గులాంనబీ ఆజాద్ అయితే.. ప్రభుత్వంపై అనేకరకాలుగా చిందులుతొక్కారు. అదే సమయంలో కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ నాయకులు, ముఖ్యమైన నాయకులు మోడీకి అనుకూలంగా గళం వినిపించారు.
కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నాయకుడు తన పదవికి ఏకంగా రాజీనామా చేసేశారు. వచ్చే ఏడాదిదాకా ఎంపీ పదవి ఉన్నప్పటికీ.. 370 విషయంలో పార్టీ వైఖరిని నిరసించి రాజీనామా చేశారు. మరోవైపు ఈ నిర్ణయం తర్వాత.. జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు.. కాంగ్రెస్ ను వీడి, భాజపాలో చేరాలనుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అలాగే.. కాంగ్రెస్ కీలక వ్యూహకర్తల్లో ఒకరైన జైరాంరమేష్ కూడా మోడీని సమర్థించారు. మరో కీలక నాయకుడు శశిథరూర్ కూడా అదే మాదిరిగా ప్రవర్తించారు. ప్రభుత్వ అనుకూల మాటలు మాట్లాడారు. శశిథరూర్ కు నోటీసులు ఇచ్చి క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కేరళ పార్టీ శాఖ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రభుత్వ అనుకూల మాటలు వల్లిస్తున్నారు. కాశ్మీరు మన అంతర్గత అంశం. పాకిస్తాన్ సహా మరే దేశమూ ఇందులో జోక్యం చేసుకోడానికి వీల్లేదు. కాశ్మీర్లో అల్లర్లను పాక్ ప్రేరేపిస్తోంది. ప్రపంచమంతటా ఉగ్రవాదానికి పాక్ కేంద్రబిందువుగా ఉంటోంది అని అన్నారు. నేను చాలా విషయాల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించాను, కానీ ఇది వేరు.. అంటూ రాహుల్ చెప్పిన మాటల ఎఫెక్టు.. ఈ అంశంపై ఇక కాంగ్రెస్ నుంచి ఏ ఇతర నాయకుడూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు.