ఎవరేమనుకున్నా ప్రజలకు ఉపయోగపడతాయనుకున్న నిర్ణయాలను నిర్భయంగా, నిజాయితీగా అమలు చేయడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టింది పేరు. ఆరోగ్యశ్రీ వంటి పథకం ఎన్నో బాలారిష్టాలు దాటుకుని దేశంలోనే అత్యుత్తమ పథకాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆయన వారసుడిగా వైఎస్ జగన్ దీ అదే పద్ధతి. తాజాగా పూర్తిస్థాయిలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. లబ్ధిదారుడి ఇంటి వద్దకే రేషన్ సరకుల పంపిణీ అనేది ఈ వాలంటీర్ వ్యవస్థలో అన్నిటికంటే అత్యంత ఆసక్తిదాయకమైన విధి.
సెప్టెంబర్ మొదటివారంలో జరిగే రేషన్ పంపిణీ నేరుగా ప్రజల ఇంటికే చేరుతుందా లేక ఎప్పటిలాగే రేషన్ దుకాణాలకు వెళ్లి తీసుకోవాలా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటివరకు అధికారుల దగ్గర ఉన్న సమాచారం మేరకు రేషన్ దుకాణాలకు వెళ్లి ప్రజలు సరకులు తీసుకోవవాల్సి ఉంది. అయితే మూడు నాలుగు రోజుల్లో సీఎం కొత్త నిర్ణయాన్ని చెబుతారని కూడా వారికి సమాచారం ఉంది.
వాలంటీర్ వ్యవస్థను తాను అనుకున్నట్టు పట్టాలెక్కించాలనుకుంటే తొలి నెల నుంచీ రేషన్ సరకులు ప్రజల ఇంటి వద్దకే వెళ్లాలి. అలాంటప్పుడు రేషన్ డీలర్ల వ్యవస్థ ఎందుకు.. ఇటీవల డీలర్లంతా రోడ్డెక్కి నిరసనలకు దిగడంతో అప్పటికప్పుడు వారి ఉపాధికి వచ్చిన ఇబ్బందేమీ లేదంటూ మంత్రులు సర్ది చెప్పారు.
మరిప్పుడు డీలర్లు, వారికితోడు వాలంటీర్లు అంటే ప్రభుత్వంపై అదనపు భారం పడదా. ఒకే పని చేయడానికి రెండు వ్యవస్థలు ఎందుకు, ఇద్దరిలో ఒకరికి కమిషన్, ఇంకొకరికి గౌరవ వేతనం రెండూ నష్టమే కదా. ఈ విధానంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ వేచి చూస్తున్నారు.
పింఛన్లు ఇవ్వడానికి ఒక వ్యవస్థ ఉంది, రేషన్ ఇవ్వడానికి మరో వ్యవస్థ ఉంది, ఇక ప్రజలకు అందుబాటులో గ్రామ సచివాలయాలు రాబోతున్నాయి, మరి వాలంటీర్ వ్యవస్థకి పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు చేయడం అధికారులకు కూడా తలకు మించిన భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జగన్ మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని తెలియజేస్తారని అంటున్నారు. ఎవరికి రుచించినా, ఇంకెవరు మనసు కష్టపెట్టుకున్నా ఆయన నిర్ణయమే ఫైనల్ కాబోతోంది.