ఉన్నట్లుండి ఉరుము లేని పిడుగులా విన్నర్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చింది. సాయి ధరమ్ తేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు. చిత్రమేమిటంటే దీనికన్నా ముందు మొదలు పెట్టిన వరుణ్ తేజ-శ్రీను వైట్ల ల మిస్టర్ సినిమా డేట్ మాత్రం రాలేదు. వరుణ్ కాలికి దెబ్బ తగలడం వల్ల కాస్త ఆలస్య మైంది ఆ సినిమా. అయినా దానికి అనుగుణంగా డేట్ ప్రకటించవచ్చు కదా? మరి అలా ఎందుకు చేయలేదు? ఇప్పుడు అర్జెంట్ గా మూడు నెలలు ముందుగా విన్నర్ డేట్ ఎందుకు ప్రకటించారు?
ఇలా చేయడం వెనుక సాయి ధరమ్ మేనమామ పవన్ స్ట్రాటజీ వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ వెనుక అన్ని విధాలా కర్త కర్త క్రియ మాదిరిగా పవన్ వున్నారన్న సంగతి తెలిసిందే. జనవరిలో మెగాస్టార్ సినిమా వుంది. మార్చి వేళకు పవన్ కళ్యాణ్ సినిమా రాబోతోంది. అది మార్చిలో వస్తే తన డిజె సినిమాను ఫిబ్రవరిలో, లేదా పవన్ సినిమా ఫిబ్రవరిలోవస్తే, తన సినిమాను మార్చిలో తేవాలనే ఆలోచనలో అల్లు అర్జున్ వున్నారు.
ఇప్పుడు సాయి ధరమ్ సినిమాను ఫిబ్రవరిలో ప్రకటించారు. అది కూడా మహాశివరాత్రి లాంటి మాంచి డేట్ కు. అంటే పవన్ సినిమా మార్చిలోనే అన్నమాట. మరి ఇప్పుడు బన్నీకి డేట్ ఏది? ఇంతుకు ముందు సరైనోడు సమయంలో కూడా అలాగే జరిగింది. సరైనోడు థియేటర్లలో వుండగానే సాయి ధరమ్ సినిమా వదిలేసారు. ఈసారి అలా కాకుండా ముందే అడ్డం పడ్డారు.
బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ మెలమెల్లగా పెరుగుతోందని ఇండస్ట్రీలో టాక్ వుంది. అభిమానుల్లో కూడా ఈ మేరకు చీలిక వుంది. బన్నీకి దొరక్కుండా త్రివిక్రమ్ ను బ్లాక్ చేసారు పవన్ అని ఓ టాక్ వుంది. అలాగే ఇప్పుడు కీలకమైన డేట్ లేకుండా ముందుగా ప్రకటించేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.