ముందుగా మూడు రోజుల తర్వాత అయినా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభకు హాజరై పెద్ద నోట్ల రద్దుపై జరుగుతున్న చర్చను వింటున్నందుకు సంతోషించాలి. ఇంతకాలం పార్లమెంటు వెలుపలే భావోద్రేక ఉపన్యాసాలు ఇస్తూ, ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న మోదీ ఇప్పుడు విపక్షాల బాణాలను ఎదుర్కోవడం మంచి పరిణామమే. అంతిమంగా ఆ చర్చల సారాంశం ఎలా ఉన్నా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ తిరిగి ఆరంభమైనందుకు సంతోషించాలి. మోదీ నిర్ణయంపై ఎన్నో వ్యాసాలు, విశ్లేషణలు వస్తున్నాయి. వాటిలో కొన్ని ఆలోచించేవిగా ఉంటున్నాయి. వాటి ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని గతంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాందీ తీసుకున్న ఎమర్జన్సీతో పోల్చవచ్చా? చైనాలో మావో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ పేరుతో చేపట్టిన కార్యక్రమాల వల్ల కోట్లాది మంది జనం మృత్యుఘోషతో కలిపి చూడవచ్చా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మోదీ నిర్ణయం పై ప్రశంసల జల్లు, విమర్శల వెల్లువ రెండూ వచ్చాయి. కాని ఇప్పుడు కాస్త ఇండిపెండెంట్‌గా ఉండే మీడియాలో వస్తున్న నిపుణుల వ్యాసాలు చదువుతుంటే నిజంగా ఆందోళన కలుగుతుంది. ఒక ఆంగ్ల పత్రికలో ఒకే రోజు ముగ్గురు ప్రముఖ అనలిస్టులు స్వామినాధన్ అంకాలేశ్వర్ అయ్యర్, అమిత్ వర్మ, సారిక ఘోష్ అనే వారు రాసిన వ్యాసాల సారాంశం చదివితే మోదీ ఏకపక్షంగా తీసుకున్న చర్యతో దేశం సంక్షోభం వైపు వెళుతున్నదన్న భావన కలుగుతుంది. నవంబర్ ఎనిమిది రాత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి దాని పరిణామాలు అర్థం చేసుకోని అమాయక సామాన్య, మధ్య తరగతి ప్రజలు బ్రహ్మాండం అనుకున్నారు. అదేదో తమకు సంబంధించింది కాదనుకున్నారు.
కాని క్రమేపి తామే క్యూలైన్‌లలో గంటల తరబడి వేచి ఉండవలసి రావడం, తమ డబ్బు తీసుకోవడానికి తమేక స్వేచ్చ లేకపోవడం, అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కోవడం, కొందరి మరణాలకు పరిస్థితులు దారి తీయడం, పెళ్లిళ్లు ఆగిపోతుండడం, చిన్న వారి బతుకులు చిధ్రమవుతుండడం, మధ్యతరగతి వారి వద్ద ఉన్న కొద్ది లక్షల రూపాయలను దొంగ డబ్బు లేదా నల్లధనంగానో ప్రభుత్వం చూస్తోందన్న బాధ.. ఇవన్ని అనుభవంలోకి వచ్చాక ప్రజలలో ఇదే నిర్ణయం పై ప్రతికూలత ఆరంభం అయింది. పైన చెప్పిన ముగ్గురి వ్యాసాలు చదివితే మోదీ ఎంత ప్రమాదకరమైన నిర్ణయం అనాలోచితంగా చేశారేమిటా? అనిపిస్తుంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడుతూ ప్రజలు తాము బ్యాంకులలో వేసుకున్న డిపాజిట్లను తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పడం ఏ దేశంలో అయినా జరుగుతుందా అని ప్రశ్నించారు. ఇది కీలకమైన ప్రశ్న. ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే అంశంగా కనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా పది కోట్లమంది చిన్న వ్యాపారులు ఉంటే ,వారిలో పది శాతం మంది వద్ద కూడా స్వైపింగ్ మిషన్‌లు లేవని, అలాంటిది నగదు రహిత లావాదేవీలు చేయాలని, కార్డులు వాడాలని కేంద్రం నిర్ణయిస్తే కోట్లాది మంది చిరు వ్యాపారులు ఎలా బతకాలని అంకలేశ్వర్ అయ్యర్ ప్రశ్నించారు. చైనాలో చైర్మన్ మావో 195 లో పంటలకు బెడదగా మారిన పక్షులను చంపాలని పిలుపు ఇచ్చి పెద్ద ఉద్యమంలా నడిపాడు.
పక్షులు పెద్ద సంఖ్యలో చచ్చిపోయాయి. కాని ఆ తర్వాత పర్యావరణం దెబ్బతిని, క్రిమికీటకాదులను తినే పక్షులు లేకపోవడం, పంటలు సర్వనాశనం అయి, కరువు కాటకాలు వ్యాపించి నాలుగున్నర కోట్ల మంది మరణించారు. గ్రేట్ లీప్ ఫార్వర్డ్ పేరుతో సాగిన కార్యక్రమాలు గ్రేట్ లీప్ బ్యాక్ వర్డ్‌గా మారాయి. ఆనాటి పరిస్థితితో ప్రధాని మోదీ నిర్ణయాన్ని పోల్చుతూ అమిత్ వర్మ వ్యాసం రాశారు. అంతేకాదు. సాధారణంగా ప్రజల వద్ద కరెన్సి లేకుండా చేయడం, పెద్ద ఎత్తున క్యూలలో ప్రజలు తమ అవసరాల కోసం నిలబడడం వంటివి ఒకకప్పుటి కమ్యూనిస్టు రష్యాలో ఉండేవి. కమ్యూనిస్టు వ్యతిరేక భావజాల పార్టీ అయిన బీజీపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా కోట్లాది మంది ప్రజలను రోడ్లపైకి తెచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.
స్టాలిన్, మావో, హిట్లర్ వంటివారి అనుభవాలను గుణపాఠాలు నేర్చుకోకుండా పాలకులా ఇలా చేస్తారా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జన్సి పెట్టిన నాటి పరిస్థితిని వివరిస్తూ మరో రచయిత సాగరిక ఘోష్ అప్పుడు కూడా ప్రతిపక్షం ఐక్యంగా లేదని, అప్పట్లో వారందరిని కలిపే శక్తిగా ప్రఖ్యాత నేత జయప్రకాష్ నారాయణ తెరపైకి వచ్చిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో జయప్రకాష్ నారాయణ మాదిరి వారు లేకపోవచ్చు. ప్రతిపక్షం ఆయనను ఎదుర్కునే స్థాయిలో లేకపోవచ్చు. అలాంటప్పుడు ప్రజలే మోడీకి ప్రతిపక్షం అవుతారని హెచ్చరించారు.
తనను నమ్మి గౌరవించిన ప్రజలపైనే మోదీ దాడిచేసి, వారిని తేలికగా తీసుకున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే మోదీ తెలిసో, తెలియకో ఒక ప్రమాదకరమైన నిర్ణయం చేసి దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టారు. దీనిని ఆయన పార్టీకి చెందినవారో, లేక ఆయన వల్ల వ్యక్తిగత లాభం కలుగుతుందనుకునేవారో, లేక ఆయన ప్రభుత్వం ద్వారా పద్మ అవార్డులు పొందిన మీడియా ప్రముఖులో భజన చేసి సంతోషపడవచ్చు. దానివల్ల వారు మోదీకి నష్టం చేసినవారే అవుతారు తప్ప ఇంకొకటి కాదు. ఎమర్జన్సీలో ఇందిరాగాంధీని కీర్తించడానికి నేతలే కాదు.. మీడియాలో చాలా భాగం పోటీ పడింది.
భజన చేసే మీడియా వల్ల పాలకులకు నష్టమే కలుగుతుంది తప్ప మేలు కలగదు. ఈ విషయాలను మోదీ పరిగణనలోకి తీసుకుని వాస్తవ పరిస్థితిని గుర్తించి సర్దుబాటు చర్యలు చేపడితే ఆయనేక మంచిది. తప్పు చేయడం తప్పు కాదు. తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవడం తెలివైన విషయం, విజ్ఞతతో కూడినది అవుతుంది. ఈ విషయాన్ని మోదీ గమనిస్తారా?
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్