డిసెంబరు 19న ఎవడుని తీసుకురావడం ఖాయం.. అని దిల్రాజు ఎంత చెబుతున్నా ఆరోజున ఎవడు రావడం అనుమానంగానే తోస్తోంది. ఎందుకంటే కాస్త సైలెంట్ గా ఉన్న తెలంగాణ గొడవ కచ్చితంగా అప్పటికి మళ్లీ యథాస్థానానికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. డిసెంబరు 19లోగా.. తెలంగాణ బిల్లుపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణపై దాదాపుగా సానుకూల నిర్ణయమే వినవచ్చు.
అదే జరిగితే.. సీమాంధ్రలో పరిస్థితులు చేజారిపోతాయి. ఆ దెబ్బ సినిమాలకు అందులోనూ చిరు ఫ్యామిలీ సినిమాలపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. సీమాంధ్రలో ఇప్పటికీ చిరు విలనే! సమాఖ్య ఉద్యమానికి మద్దతు తెలపకుండా.. ఎవరికీ కనిపించకుండా ఢిల్లీలోనే మకాం పెట్టిన చిరు అంటే. ఇప్పటికీ అక్కడి ప్రజలు గుర్రగానే ఉన్నారు. ఆ దెబ్బ.. ఎవడుపై చూపించే అవకాశాలు పుష్కలంగాఉన్నాయి. తెలంగాణ అంశానికి భయపడే జులై 31న రావల్సిన సినిమా ఆగిపోయింది.
ఇప్పుడు మరోసారి బ్రేకులు పడే అవకాశం ఉంది. అయితే దిల్ రాజు మరోలా ఆలోచిస్తున్నారు. డిసెంబరు 19 కంటే ముందు. అంటే… డిసెంబరు మొదటి వారంలో సినిమా విడుదల చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ అంశం ఇంకా రగలకముందే ఈ సినిమా వదిలించుకోవాలి అనుకొంటున్నారట. కాబట్టి.. ఎవడు డేట్ కాస్త ముందొచ్చినా.. సంక్రాంతికి వాయిదా పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.