ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీపార్వతి బయోపిక్, ఇలా చాలా హల్ చల్ చేస్తున్నాయి ఇటీవల కొంత కాలంగా. అయితే దాదాపు నాలుగయిదేళ్ల క్రితమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ అన్నది తెరపైకి రాబోయి ఆగిపోయింది. వైఎస్ చనిపోయిన కొత్తలోనే దర్శకుడు పూరిజగన్నాధ్ ఆ ప్రయత్నం చేసి ఆపేసారు. ఇన్నాళ్లకు మళ్లీ వైఎస్ బయోపిక్ అన్నది ఊపిరి పోసుకుంటోంది.
ఆల్ రెడీ ఇండస్ట్రీలో రెండు హిట్ సినిమాలు అందించిన ఒక సంస్థ వైఎస్ బయోపిక్ కోసం మాంచి స్క్రిప్ట్ రెడీ చేయించింది. ఓ సక్సెస్ ఫుల్ మీడియం డైరక్టర్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ తయారుచేసారు. అయితే వైఎస్ బయోపిక్ కావడంతో, సంబంధీకుల పర్మిషన్లు అవసరం. అందువల్ల వీలు చూసుకుని, జగన్ ను కలిసి, స్క్రిప్ట్ నెరేట్ చేసి, ఓకె అన్న తరువాత బయటకు ప్రకటిస్తారు. ఓ ఫీల్ గుడ్ యూత్ మూవీ, ఓ హర్రర్ కామెడీ అందించిన ఆ డైరక్టర్ వైఎస్ లైఫ్ స్కెచ్ మీద చాలా పెర్ ఫెక్ట్ గా స్క్రిప్ట్ రెడీ చేసారట.
ఇప్పటికే ఈ విషయం జగన్ సన్నిహితులకు తెలియచేసి, జగన్ అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రలోనే జగన్ ను కలిసి, ఆపై లాంఛనంగా ప్రకటించి, షూట్ ప్రారంభిస్తారు. ఈ సినిమాకు టైటిల్ 'యాత్ర' అని పెట్టడం విశేషం. తన పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.అందుకే సినిమాకు అదే టైటిల్ గా పెట్టారు. ఇప్పటికే టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవహారం పూర్తయింది.
అయితే వైఎస్ పాత్ర ఎవరు పోషిస్తారో? అవన్నీ ఇంకా బయటకు చెప్పకుండా గుంభంగానే వుంచారు. సినిమాకు బడ్జెట్ మాత్రం కాస్త భారీగానే వుంటుందని, ఆంధ్ర అంతా చిత్రీకరణ వుంటుందని తెలుస్తోంది.